● సిలిండర్‌ను తరలించే క్రమాన ఘటన ● 20మందికి అస్వస్థత, మూడు గంటల పాటు ఇక్కట్లు
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి వరంగల్ క్రాస్‌రోడ్‌లో బుధవారం అమ్మోనియా సిలిండర్ లీకేజీతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. శ్వాస పీల్చుకోలేని పరిస్థితితో పలువురు అస్వస్థతకు గురికాగా, షాపులను మూసివేయించి పాఠశాలల్లో పిల్లలను ఇళ్లకు పంపించాల్సి వచ్చింది.
ఏం జరిగిందంటే....
ఖమ్మం–సూర్యాపేట ప్రధాన రహదారి పక్కన ఖాళీ ప్రదేశంలో పెద్ద సిలిండర్ చాన్నాళ్లుగా ఉంది. గ్యారేజీ యజమాని ఈశ్వరయ్య, వర్కర్ ఉదయ్ ఆ సిలిండర్‌ను అక్కడి నుంచి తీసే క్రమాన సుత్తితో కొట్టడంతో గ్యాస్ లీకై అమ్మోనియా గ్యాస్ ఘాటైన వాసనతో కిలోమీటర్ దూరం వరకు వ్యాపించింది. దీంతో దుకాణాదారులు, ఇళ్లల్లోని పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈక్రమాన అప్రమత్తమైన వ్యాపారులను షాపులను మూసివేశారు. అంతేకాక సమీపంలోని ప్రైవేట్ పాఠశాల నుంచి పిల్లలను ఇంటికి పంపించారు. అయితే, ఇళ్లలోని వారే కాక రహదారిపై వెళ్తున్న వారు కూడా శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడ్డారు. ఈ సమాచారం అందుకున్న సీఐ ముష్క రాజు, మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి సిబ్బందితో చేరుకుని అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు.
మరింత తీవ్రత
అగ్నిమాపక సిబ్బంది చేరుకున్న గ్యాస్ విడుదలవుతున్న సిలిండర్‌పై వేగంగా నీళ్లు చల్లారు. అంతేకాక మంటలను ఆర్పే గుణం ఉన్న గ్యాస్ విడుదల చేయడంతో అమ్మోనియా గ్యాస్ ప్రభావం మరింత పెరిగి స్థానికులు ఆందోళన చెందారు. ఈక్రమాన స్థానికుడైన సంపత్ జేసీబీతో వచ్చి గ్యాస్ వెలువడుతున్న ప్రాంతమంతా మట్టితో పూడ్చడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గ్యాస్ గాఢత కారణంగా అస్వస్థతకు గురైన సుభద్ర, ఎస్‌కే.బషీర్, సయ్యద్, ముంతాజా, సయ్యద్. హైదర్, హంజా తదితరులను ఆస్పత్రికి తరలించగా మున్సిపల్ చైర్‌పర్సన్ అనిత పరామర్శించారు. కాగా, ఘటనపై శానిటరీ ఇన్‌స్పెక్టర్ వీరన్న ఇచ్చిన ఫిర్యాదుతో గ్యారేజీ నిర్వాహకుడు ఈశ్వరయ్య, ఉదయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.


