ఆయుర్వేద వైద్యంపై
ప్రజలకు అవగాహన
● పీఎం విశ్వకర్మ, ఎస్‌హెచ్‌జీలకు రుణాలపై దృష్టి ● డీసీసీ, డీఎల్‌ఆర్సీ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో లక్ష్యం మేర పంట రుణాలు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన డీసీసీ, డీఎల్‌ఆర్సీ సమావేశంలో వివిధ పథకాల కింద రుణాల మంజూరుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు రూ.5,266 కోట్ల పంట రుణాలకు గాను 39శాతమే పూర్తయిందని, ఇకనైనా రెన్యూవల్స్‌లో వేగం పెంచి బ్రాంచీల వారీగా రుణాల పంపిణీ లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. అలాగే, పీఎం విశ్వకర్మ పథకం కింద పెండింగ్ ఉన్న 515 దరఖాస్తులను సత్వరమే పరిశీలించి అర్హులైన రుణాలు మంజూరు చేయాలన్నారు. అంతేకాక మహిళా స్వయం సహాయక సంఘాలకు నవంబర్ నాటికి రూ.768 కోట్ల రుణాల్లో 73శాతమే పూర్తయినందున మిగిలిన లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అలాగే, నిరర్ధక ఆస్తుల శాతం తగ్గింపు, వీధి వ్యాపారులు రుణాల పంపిణీ, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవసరమైన రుణ సదుపాయాలపై అదనపు కలెక్టర్ సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎల్‌డీఎం రవిప్రసాద్, ఆర్‌బీఐ జిల్లా అధికారి యశ్వంత్‌సాయి, జిల్లా పశు సంవర్థక, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు డాక్టర్ పురంధర్, ఫిరంగి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం వైద్యవిభాగం: సంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానం, ఔషధాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంప్రదాయ వైద్య విజ్ఞానం, సహజ చికిత్సా పద్ధతులకు ప్రాధాన్యత ఉన్నందున ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వైద్యుల సూచనల మేరకు మందులు వినియోగించడమే కాక ఆరోగ్య పరిరక్షణకు సహజసిద్ధమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఈశిబిరంలో 415 మందికి వైద్య సేవలు అందించినట్లు డీఎంహెచ్‌ఓ రామారావు తెలిపారు. ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకులు బి.ప్రమీలాదేవి, ఆయుర్వేద వైద్యాధికారి సీహెచ్.అనిల్‌కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.


