పెనుబల్లి: తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వకపోగా, ఇప్పుడు రికార్డుల్లో పేర్లు తొలగించారని ఆరోపిస్తూ పెనుబల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సోమవారం దళిత కుటుంబ సభ్యులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. మండలంలోని గౌరారం రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 451లోని పదెకరాల్లో చిల్లిముంత గంగయ్య 1960–65 మధ్య కాలంలో పోడు కొట్టుకొని వ్యవసాయం ప్రారంభించాడు. ఆతర్వాత నాలుగు ఎకరాలు అదే గ్రామానికి చెందిన అరవపల్లి రామారావుకు ఇవ్వగా, మిగిలిన ఆరు ఎకరాల భూమిని ముగ్గురు కొడుకులకు పంచాడు. పట్టా పాస్ పుస్తకాల కోసం వారు ప్రయత్నిస్తే, లంచం డిమాండ్ చేశారని, తాము డబ్బు ఇవ్వకపోవడంతో పేర్లు తొలగించారని సీతారాములు, సుజాత, గోపి, సునీత, జమలయ్య, అలివేలు ఆరోపించారు. ఈమేరకు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న తహసీల్దార్ వీరభద్ర నాయక్ వినతిపత్రాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో, ప్రస్తుతం రెవెన్యూ ఉద్యోగులు చేసిన విచారణలో వీరికి భూమి లేనట్లు తేలిందన్నారు. ఇదే విషయమై లేఖ ఇచ్చామన్నారు. సదరు కుటుంబం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.
కళ్లకు గంతలతో దళిత కుటుంబం నిరసన


