పెనుబల్లి: గురుకులంలో చన్నీళ్లతో స్నానం చేయలేకపోతోందని, ఇంట్లోనైతే వేడి నీళ్లు ఉంటాయని బిడ్డను తల్లిదండ్రులు తీసుకొచ్చారు. అయితే, ఇంటి వద్ద జరిగిన ప్రమాదంలో బిడ్డనే కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులకు తీరని కష్టం ఎదురైంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు... పెనుబల్లి మండలం పాతకారాయిగూడెం ఎస్‌సీ కాలనీకి చెందిన రావూరి పాపారావు – స్వాతి దంపతులకు పావని(12)తో పాటు ఓ కుమారుడు ఉన్నాడు. అడవిమల్లెలలో గురుకుల బాలికల పాఠశాలలో పావని 6వ తరగతి చదువుతుండగా చలి పెరగడం, హాస్టల్‌లో వేడినీరు లేకపోవడంతో స్నానానికి ఇబ్బంది అవుతోందని మూడు రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చాడు. కాగా, ఇటీవలే పాపారావు ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కున్నాడు. ఉదయమే ఆటో స్టార్ చేసి పెట్టే ఆయన బుధవారం కూడా స్టార్ట్ చేసి, అప్పుడప్పుడు ఎక్స్‌లేటర్ ఇవ్వాలని పావనికి సూచించాడు. అయితే, ఆటో – ఇంటి పిల్లర్ మధ్యలో నిల్చొని ఎక్స్‌లేటర్ ఇచ్చే క్రమాన ఆటో ముందుకు దూకడంతో పావని రెండింటికి మధ్య ఇరుక్కుని తీవ్రంగా గాయపడింది. దీంతో ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించగా పరిస్థితి విషమించి గురువారం తెల్లవారుజామున మృతి చెందింది.
ఆటో ఎక్స్‌లేటర్ ఇస్తుండగా ప్రమాదం


