రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఏదులాపురం, ఖమ్మంలో
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఖమ్మంరూరల్: ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి పలు వార్డుల్లో కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి రూ.2.49కోట్లు వ్యయంతో నిర్మించే అంతర్గత సీసీ రోడ్లు, ఖమ్మం రూరల్ మండలంలో రూ.2.70కోట్లతో నిర్మించే రోడ్డు పనులకు మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేపోయినా పేద ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అయితే, పథకాలు, అభివృద్ధిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఎస్‌ఈ జి.వెంకట్‌రెడ్డి, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఆర్‌డీఓ ఎన్.శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, కమిషనర్ ఏ.శ్రీనివాసరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబాలకు రక్షణగా ‘బీమా’
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు తమ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ పరిధి 60వ డివిజన్ రామన్నపేటలో నిర్మించే సైడ్ డ్రెయిన్ పనులకు కలెక్టర్ దివాకర, కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూమి లేని నిరుపేదలు, కులవృత్తులు లేని కుటుంబాల పెద్దలు దురదృష్టవశాత్తు దూరమైతే కుటుంబం రోడ్డున పడొద్దనే భావనతో సీఎం రేవంత్‌రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. కాగా, అర్హులందరికీ దశల వారీగా ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఆర్‌డీఓ ఎన్.శ్రీనివాస్, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


