ఎమ్మెల్సీ రేసులో... | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ రేసులో...

Nov 25 2026 12:32 AM | Updated on Nov 25 2026 12:32 AM

వచ్చే మార్చి వరకు పదవి

బరిలో నిలిచేందుకు స్వతంత్ర అభ్యర్థుల ఆసక్తి పోటీలో ఉండేలా వివిధ వర్గాలతో సమావేశాల నిర్వహణ ఇప్పటికే కాంగ్రెస్‌, సీపీఎం అభ్యర్థుల ఖరారు బీఆర్‌ఎస్‌ తరఫున రాకేష్‌రెడ్డి పర్యటనలు.. వేచిచూసే ధోరణిలో బీజేపీ

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై పలువురు దృష్టి సారించారు. ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై కసరత్తు చేస్తుండగా.. స్వతంత్ర అభ్యర్థులు మాత్రం ఓటర్లలోకి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఎన్నికకు ఇంకో నాలుగు నెలల సమయం ఉండగానే అటు స్వతంత్ర అభ్యర్థులే కాక ఇటు పార్టీలు హడావుడి చేస్తుండడం గమనార్హం. సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా పట్టభద్రులను కలిసేందుకు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఓటరు నమోదు నుంచే...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగే అవకాశముంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పట్టభద్రుల ఓటర్ల నమోదు చేపడుతున్నారు. అలాగే రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ఓటరు నమోదుపై దృష్టి సారించాయి. పట్టభద్రులతో ఓటర్లుగానమోదు చేయించేందుకు పలు పార్టీల నాయకులు, ఆశావహులు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయడం విశేషం. మరోపక్క పార్టీల వారీగా ఎన్నికల కోసం జిల్లా, నియోజకవర్గ ఇన్‌చార్జిలను నియమించారు. ముఖ్య నాయకులు ఉమ్మడి జిల్లాలో తరచూ పర్యటిస్తూ ఎన్నికపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ముందంజలో కాంగ్రెస్‌

అభ్యర్థుల ఎంపికలో అందరి కంటే కాంగ్రెస్‌ ముందంజలో నిలిచింది. ఇప్పటికే పార్టీ అధిష్టానం అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని ఎంపిక చేసింది. ఆయనకు సీపీఐ మద్దతు ప్రకటించింది. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని ప్రకటించకున్నా గత ఎన్నికల్లో పోటీ చేసిన ఏ.రాకేష్‌రెడ్డికే సంకేతాలు ఉన్నాయనే సమాచారంతో ఆయన ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో ఆయన పేరు ఖరారవుతుందనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క పీడీఎఫ్‌ అభ్యర్థి కొల్లి సత్యనారాయణను ప్రకటించి సీపీఎం మద్దతు తెలిపింది. బీజేపీ మాత్రం అభ్యర్థిని ప్రకటించకపోగా వేచిచూసే ధోరణి అవలంబిస్తోంది.

స్వతంత్రులు సై..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువ మంది బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. గతంలో కన్నా భిన్నంగా ఈసారి నాలుగు నెలల ముందు నుంచే స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికపై దృష్టి సారించారు. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యాక అభ్యర్థులు రంగంలోకి దిగుతారు. కానీ ప్రధాన పార్టీలకు దీటుగా ఇప్పటి నుంచే వార్తల్లో నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గతంలో నామమాత్రపు పోటీ ఇస్తే చాలన్న భావనతో ఉండే స్వతంత్రులు ఈసారి కచ్చితంగా గెలవాలనే ధీమాతో సభలు నిర్వహిస్తున్నారు. వివిధ అసోసియేషన్లతో మమేకం కావడమే కాక సమావేశాలు నిర్వహిస్తూ గతంలో తాము చేసిన ప్రజా సేవను వివరిస్తున్నారు. ఫలితంగా ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా చింతపండు నవీన్‌(తీన్మార్‌ మల్లన్న) కొనసాగుతున్నారు. 2024 మే 27న ఎన్నిక జరగ్గా జూన్‌ 8న ఫలితాలు వెల్లడయ్యాయి. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. ఇంకా నాలుగు నెలలే ఉండడం, ఓటరు జాబితా తయారీ కూడా చివరి దశకు చేరడంతో ప్రధాన పార్టీలే కాక స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికపై ప్రత్యేక నజర్‌ పెట్టారు.

ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన ‘పట్టభద్రుల’ హడావుడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement