నాబార్డ్ నిబంధనలకు
అనుగుణంగా ఎంపికకు కసరత్తు
ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తి
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈఓ) నియామక ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం డీసీసీబీ ఇన్‌చార్జ్ సీఈఓ ఎన్.వెంకటఆదిత్య స్థానంలో రెగ్యులర్ సీఈఓ నియామకానికి చర్యలు చేపట్టారు. రెండేళ్ల క్రితం సీఈఓగా పనిచేసిన రెహమాన్‌పై ఆరోపణలు రావడంతో ఆయన స్థానంలో రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్(టీజీ క్యాబ్)లో ఏజీఎంగా పనిచేస్తున్న వెంకటఆదిత్యను ఇన్‌చార్జ్‌గా నియమించారు. నాబార్డ్ నిబంధనల మేరకు ‘ఫిట్ అండ్ ప్రాపర్’ విధానంలో నూతన సీఈఓను నియమించాల్సి ఉండగా ఈ ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ చేశారు. ఏజీఎం స్థాయి నుంచి సీనియర్ మేనేజర్ల వరకు వివిధ బ్యాంకుల్లో ఎనిమిదేళ్ల అనుభవం కలిగిన వారిని అర్హులుగా నిర్ణయించారు. అయితే, అప్పుడు బ్యాంక్ పర్సన్ ఇన్‌చార్జిగా ఉన్న కలెక్టర్ బదిలీతో ప్రక్రియ నిలిచిపోయింది. మళ్లీ ఇప్పుడు ప్రక్రియ ప్రారంభించారు.
ఇంటర్వ్యూలకు 11మంది హాజరు
నోటిఫికేషన్ ఆధారంగా ఖమ్మం డీసీసీబీతో పాటు ఇతర డీసీసీబీలు, వాణిజ్య బ్యాంకుల అధికారులు 16మంది సీఈఓ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించగా 11 మంది హాజరయ్యారు. బ్యాంక్ పర్సన్ ఇన్‌చార్జ్, కలెక్టర్ దివాకర టీ.ఎస్., నాబార్డ్ డీజీఎం శ్రీకాంత్ జామ్నే, టీజీ క్యాబ్ ఎండీ వై.కే.రావు, ప్రొఫెషనల్ డైరెక్టర్ మోహనయ్యలతో కూడిన కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అభ్యర్థుల అర్హతల ఆధారంగా ముగ్గురిని ఎంపిక చేసి ఆర్‌బీఓ ప్రవాహ్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆపై 90 రోజుల వ్యవధిలో ఒకరిని ఖరారు చేసి పేరును డీసీసీబీకి పంపిస్తారు. ఆ తర్వాత కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా సహకార అధికారితో కూడిన కమిటీ ఆర్‌బీఐ నిర్ణయాన్ని పరిశీలించి నూతన సీఈఓను ప్రకటించాల్పి ఉంటుంది.


