ఉన్నట్టా.. లేనట్టా ?! | - | Sakshi
Sakshi News home page

ఉన్నట్టా.. లేనట్టా ?!

Nov 19 2026 12:31 AM | Updated on Nov 19 2026 12:31 AM

● చేప పిల్లల పంపిణీపై ‘నీలి’నీడలు ● తుపాన్లతో జలాశయాల్లోకి నీరు చేరినా స్పష్టత కరువు ● మత్స్యకారుల్లో సన్నగిల్లుతున్న ఆశలు

● చేప పిల్లల పంపిణీపై ‘నీలి’నీడలు ● తుపాన్లతో జలాశయాల్లోకి నీరు చేరినా స్పష్టత కరువు ● మత్స్యకారుల్లో సన్నగిల్లుతున్న ఆశలు

ఖమ్మం వ్యవసాయం: ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ ఉంటుందా, రద్దు చేశారా అన్న అంశంపై స్పష్టత లేక మత్స్యకారుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. అక్టోబర్‌ వరకు వర్షాభావ పరిస్థితుల్లో జలాశయాల్లోకి నీరు చేరకపోవడంతో పథకం అమలులో జాప్యం జరిగింది. ఆ తర్వాత తుపాన్లతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధిక శాతం జలాశయాల్లోకి నీరు చేరింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో మత్స్యకారులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 125 జలాశయాలకు కుదింపు

సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో చేప పిల్లలను జలాశయాల్లో వదలడం ఆనవాయితీ. కానీ ఈసారి ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని జలాశయాల్లోకి ఆశించిన మేర నీరు చేరలేదు. దీంతో చేప పిల్లల పంపిణీ పథకం అక్టోబర్‌ వరకు సందిగ్ధత కొనసాగింది. చివరకు శాశ్వత నీటి వనరులు ఉన్న జలాశయాల్లోనే చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యాన నీటిపారుదల శాఖనుంచి 70 శాతానికి పైగా నీరు ఉన్న శాశ్వత జలాశయాల నివేదిక సేకరించారు. ఏటా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1,622 జలాశయాల్లో రూ.6 కోట్ల వ్యయంతో 5.50 కోట్ల చేప పిల్లలను వదులుతారు. కానీ ఆరు నెలల పాటు 50 శాతానికి పైగా నీరు ఉండే జలాశయాల నివేదిక తెరపైకి రావడంతో ఈ ఏడాది పథకాన్ని 125 జలాశయాలకే పరిమితం చేయాల్సి వచ్చింది. ఖమ్మం జిల్లాలో 882 జలాశయాలకు కేవలం 64, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 740 జలాశయాలకు గాను కేవలం 61 జలాశయాల్లోనే చేప పిల్లలను వదిలే అంశాన్ని పరిశీలించారు.

తుపాన్లతో మారిన పరిస్థితి

అక్టోబర్‌ తర్వాత పరిస్థితులు మారాయి. అర్నబ్‌, మురసు తుపాన్లు తెలంగాణను తాకడంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కుండపోత వర్షాలతో అత్యధిక జలాశయాల్లోకి నీరు సమృద్ధిగా చేరింది. దీంతో చేప పిల్లల పంపిణీ పథకం అమలవుతుందని మత్స్యకారులు ఆశపడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఆదేశాలు రాలేదు. నవంబర్‌ రెండో వారం దాటుతున్నా శాశ్వత నీటి వనరులున్న జలాశయాల్లోనైనా చేపపిల్లలు వదిలే అంశంపై స్పష్టత లేక మత్స్యశాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు. మరోపక్క ప్రభుత్వం జలాశయాల్లోని నీటిని తాగు అవసరాలకు వినియోగించాలని చెబుతోంది. దీంతో ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ పథకం ఆగినట్టేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

25వేల కుటుంబాల ఉపాధిపై ప్రభావం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేపల వేట, అమ్మకంపై ఆధారపడి 25 వేల మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను జలాశయాల్లో వదిలితేనే ఆరు నెలల తర్వాత వేట సాగిస్తూ కుటుంబాలను పోషించుకుంటారు. ప్రస్తుతం తుపాన్లతో నీరు వచ్చినా పథకం అమలు కాకపోతే వచ్చే ఏడాది వేట లేక ఉపాధి పూర్తిగా కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నీరు నిండిన జలాశయాల్లోనైనా చేప పిల్లలను వదిలేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement