టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయ్
ఖమ్మం సహకారనగర్: పాఠశాల విద్యాశాఖలో ఇంటర్ విద్య విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్ సూచించారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మల్లయ్య అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్య ఉన్నత విద్యకు పునాది వంటిదని తెలిపారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్నందున విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాసంఘాల నాయకులతో చర్చించాక ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. లేనిపక్షంలో అధ్యాపకుల ఉద్యోగ భద్రత, గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం పడుతుందని చెప్పారు. అలాగే, పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు పి.నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళరావుతో పాటు సంధ్యారాణి, ఉమాదేవి, జి.వెంకటేశ్వర్లు, హన్మంతరావు, బాసన్, ఆకుల నాగేశ్వరరావు కోటేశ్వరరావు, కె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


