● ఖమ్మం మార్కెట్‌కు 12,500 బస్తాల పత్తి ● నిలకడ లేని ధరతో రైతుల్లో అయోమయం
ఖమ్మంవ్యవసాయం: తెల్ల బంగారంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సోమవారం కళకళలాడింది. ప్రస్తుత సీజన్‌లో నిత్యం 4 – 5 వేల బస్తాల పత్తి విక్రయానికి వస్తుండగా, సోమవారం ఏకంగా 12,500 బస్తాల పత్తిని రైతులు తీసుకొచ్చారు. జిల్లాలోని 2.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులకు తోడు తుపాన్లతో దిగుబడిపై ప్రభావం పడింది. సాధారణంగా ఎకరాకు 10 – 12 క్వింటాళ్ల మేర వచ్చే దిగుబడి 4 – 5 క్వింటాళ్లు దాటడం లేదు.
ధరలో హెచ్చుతగ్గులు
ఓ పక్క దిగుబడి లేక రైతులు ఆందోళనకు గురవుతుండగా, పత్తి ధరలో ఒడిదుడుకులతో మరింత నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాకు కనీస మద్దతు ధర రూ.8,667గా నిర్ణయించింది. సీజన్ ఆరంభంలో రూ.9,300 వరకు పలికిన పత్తి క్రమంగా తగ్గింది. బేలు, సీడ్ ధరలు ఇటీవల తగ్గడంతో పాటు తుపాన్ల ప్రభావం కూడా ధరపై పడింది. ఖమ్మం మార్కెట్‌లో సోమవారం క్వింటాకు గరిష్టం రూ.8,900, మోడల్ ధర రూ.8,800, కనిష్ట ధర రూ.7,001గా నమోదైంది.


