బాలల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి(గ్రీవెన్స్ డే)లో భాగంగా అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఏవైనా తిరస్కరిస్తే అందుకు కారణాలను తెలియచేయాలని పేర్కొన్నారు. డీఆర్వో రామమూర్తి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● ఏదులాపురం మున్సిపాలిటీ ఎస్సీ కాలనీకి చెందిన పి.వెంకన్న తాను వినికిడి సమస్యతో బాధపడుతున్నందున సదరం సర్టిఫికెట్ జారీ చేసి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
● కై కొండాయిగూడెంకు ముస్లింలు ఖబరస్తాన్‌కు స్థలం కేటాయించాలని వినతిపత్రం అందజేశారు.
● కొణిజర్ల మండలంలోని లక్ష్మీపురంలో దళిత కుటుంబాల కోసం శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని జూపూడి అశోక్, చింతపల్లి సువార్త, అర్లప్ప, అనిల్ తదితరులు వినతిపత్రం ఇచ్చారు.
● నాయుడుపేట ప్రధాన కూడలిలో వైన్స్, సమీపంలో బార్ ఉండడం వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడడమే కాక ప్రయాణికులు, మహిళలు ఇబ్బంది పడుతున్నందున జనసంచారం తక్కువ ఉండే ప్రాంతాలకు మార్చేలా ఆదేశాలు ఇవ్వాని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మామిండ్ల శ్రీనాథ్‌రెడ్డి ఆధ్వర్యాన వినపత్రం అందజేశారు.
గ్రీవెన్స్ డేలో కలెక్టర్ దివాకర టీ.ఎస్.
బాలలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సోమవారం ప్రత్యేకంగా బాలల ప్రజావాణి నిర్వమించారు. ఈ సందర్భంగా పలువురు పిల్లలు వారి తల్లిదండ్రులతో హాజరై దరఖాస్తులు సమర్పించారు. మొత్తం 19 దరఖాస్తులు అందగా, పరిష్కారంపై సంబంధిత శాఖలకు కలెక్టర్ సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలల భద్రత, విద్య, ఆరోగ్యం, పోషణ, హక్కులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి ఏ. ప్రమీల, జిల్లా బాలల పరిరక్షణ అధికారి టి.విష్ణువందన, కార్మిక అధికారి వెంగమాంబ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ లక్ష్మీనారాయణ, సీసీఆర్‌బీ సీఐ రమేష్, ఉద్యోగులు సోనీ, యశోద, శ్రీలక్ష్మి, నిరోషా, స్రవంతి, సందీప్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


