ముదిగొండ: ప్రభుత్వాలు విద్యారంగంపై చిన్నచూపు చూస్తుండడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి పేర్కొన్నారు. యూనియన్ జిల్లా మహాసభలు ముదిగొండలో ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలుత జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి సెంటర్ వరకు సంఘం ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రవి మాట్లాడుతూ ప్రస్తుత తరుణాన తెలంగాణలో కొత్తగా ఒక్క పాఠశాల కూడా నిర్మించాల్సిన అవసరం లేదని, సరైన విద్యా పాలసీని అమలుచేస్తే సరిపోతుందని తెలిపారు. సీపీఎస్ రద్దుతో పాటు ఉపాధ్యాయుల హక్కులు, విద్యారంగం సమస్యల పరిష్కారానికి టీఎస్ యూటీఎఫ్ పోరాడుతోందని చెప్పారు. విద్యారంగానికి నష్టదాయకమైన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రంలో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కుటుంబ సంక్షేమ నిధి పథకం ద్వారా ఇప్పటివరకు రూ.4కోట్లు అందించామని రవి తెలిపారు. నాయకులు దుర్గాభవాని, పారుపల్లి నాగేశ్వరరావు, వలీ, రామారావు, పద్మ, రామకృష్ట, కోటేశ్వరరావు, విజయ్, ప్రశాంతి, సుధాకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి


