ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదానానికి భక్తులు ఆదివారం విరాళం అందజేశారు. మధిరకు చెందిన రాళ్లబండి వెంకట రామకృష్ణశాస్త్రి – బాలాత్రిపురసుందరి దంపతులు రూ.1,00,116 విరాళాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మకు అందచేశారు. ఈ సందర్భంగా దాతలకు ప్రసాదం అందజేసి స్వామి వారి శేషవస్త్రాలు బహూకరించారు. అలాగే, ఆర్‌టీఐ కమిషనర్ పీ.వీ.శ్రీనివాసరావు, బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర కమిటీ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ తదితరులు శ్రీ వారికి దర్శించుకుని పూజలు చేశారు. వీరిని ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ ఆలయ మర్యాదలతో స్వాగతించి పూజల అనంతరం శ్రీవారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


