తక్షణ చికిత్స.. ప్రాణరక్షణ | - | Sakshi
Sakshi News home page

తక్షణ చికిత్స.. ప్రాణరక్షణ

Nov 15 2026 1:26 PM | Updated on Nov 15 2026 1:26 PM

అంతా ఆన్‌లైన్‌లోనే...

రోడ్డు ప్రమాద బాధితులకు చేయూత

ఉచితంగా రూ.1.50 లక్షల విలువైన అత్యవసర చికిత్స

ఉమ్మడి జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో

అందుబాటులోకి స్కీం

ఖమ్మం వైద్యవిభాగం: రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్‌ అవర్‌’లో అత్యవసర చికిత్స అందించేలా కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్‌(ప్రైమ్‌ మినిస్టర్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ విక్టిమ్స్‌ హాస్పిటలైజేషన్‌ అండ్‌ అస్యూర్డ్‌ ట్రీట్‌మెంట్‌) పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రమాదాల్లో గాయపడిన వారికి వీలైనంత త్వరగా వైద్యం అందించి ప్రాణాలు కాపాడడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. నగదు లేవనే కారణంతో ఏ ఆస్పత్రి కూడా చికిత్సకు నిరాకరించకుండా, ప్రభుత్వమే బిల్లు చెల్లించేలా ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి ఏడు రోజుల్లోగా క్షతగాత్రులకు రూ.1.50 లక్షల వరకు ఉచితంగా నగదు రహిత వైద్య చికిత్స అందిస్తారు. పీఎం రాహత్‌ పథకం ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అమల్లోకి రాగా, అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.

ఏ ఒక్కరి ప్రాణాలు పోకుండా..

రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు సరైన సమయానికి వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. ఇంకొందరు శాశ్వత అంగవైకల్యం బారిన పడుతున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తీసుకెళ్తే కేసులు పెడతారనే భయంతో పలువురు ముందుకు రావడం లేదు. ఎవరైనా ముందుకొచ్చినా సమీపంలో ప్రభుత్వ ఆస్పత్రులు లేకపోతే ప్రైవేట్‌ ఆస్పత్రులకు తీసుకెళ్లిన క్రమాన చికిత్స ఖర్చు ఎలా అన్న ప్రశ్న ఎదురవుతోంది. ఇలాంటి సందేహాలకు చెక్‌ పెట్టేలా కేంద్రప్రభుత్వం ‘పీఎం రాహత్‌’ పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 16న ప్రారంభించింది. ఈక్రమాన క్షతగాత్రులను గుర్తించిన వారు 112 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇస్తే అంబులెన్స్‌ను సమకూర్చడమే కాక సమీపంలో గుర్తింపు పొందిన నెట్‌వర్క్‌ ఆస్పత్రి వివరాలు తెలియజేస్తారు. అక్కడకు తీసుకెళ్తే ముందస్తు చెల్లింపులు లేకుండా తక్షణమే చికిత్స అందించాల్సి ఉంటుంది. అంతేకాక క్షతగాత్రుడిని తరలించిన వ్యక్తిని ‘రాహ్‌ వీర్‌’గా గుర్తించి నగదు ప్రోత్సాహకం అందజేస్తారు.

పోర్టల్‌లో 47 ఆస్పత్రులు..

పీఎం రావత్‌ పథకం ద్వారా పోర్టల్‌లో ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులను చేర్చారు. అంతేకాక ప్రైవేట్‌ ఆస్పత్రులకు కూడా అనుమతి ఇస్తున్నారు. రెండు జిల్లాల కలెక్టర్ల సూచనలతో అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులను ఎం ప్యానల్‌లో చేర్చేలా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతానికి ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రితో పాటు సత్తుపల్లి, మధిర, వైరా, తిరుమలాయపాలెం ఏరియా ఆస్పత్రులు, కల్లూరు, నేలకొండపల్లి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో వైద్య సేవలు అందనున్నాయి. ఇవికాక 25 ప్రైవేట్‌ ఆస్పత్రులు ఉండగా, ఇవన్నీ కూడా జిల్లా కేంద్రంలోనే ఉండడంతో ఇతర పట్టణాల్లో ఆస్పత్రులను చేర్చేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం జిల్లా ఆస్పత్రితో పాటు భద్రాచలం, అశ్వారావుపేట, మణుగూరు, ఇల్లెందు ఏరియా ఆస్పత్రులు, పాల్వంచ, చర్ల, జూలూరుపా డు సీహెచ్‌సీల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాక ఏడు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పీఎం రావత్‌ సేవలు అందించేందుకు అనుమతి ఇచ్చారు.

క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించగానే చికిత్స ఆరంభించి సంబంధిత పోర్టల్‌లో వివరాలు నమోదు చేస్తారు. తద్వారా పీఎం రాహత్‌ విభాగానికి సమాచారం అందుతుంది. ఈక్రమాన ఎలాంటి చెల్లింపులు లేకుండానే ఏడు రోజుల వరకు రూ.1.50లక్షల విలువైన చికిత్స అందజేస్తారు. ఇందులో వైద్య పరీక్షలు, అత్యవసర శస్త్రచికిత్సలు, మందులతో పాటు ఐసీయూ సేవలన్నీ ఉంటాయి. తొలుత 112 నంబర్‌కు ఫోన్‌ చేసిన క్రమాన పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తారు. అంతేకాక ఆస్పత్రి నుంచి పీఎం రాహత్‌ పోర్టల్‌కు అందిన సమాచారం ఆధారంగా కేంద్రం నుంచి రూ.1.50లక్షల నిధులు కలెక్టర్‌ ఖాతాకు, అక్కడి నుంచి ఆస్పత్రికి చెల్లించేలా పథకంలో నిబంధనలు పొందుపరిచారు. ఇదంతా పది రోజుల్లో పూర్తికానుండడంతో ప్రైవేట్‌ ఆస్పత్రులు కూడా క్షతగాత్రుల అత్యవసర చికిత్సకు నిరాకరించే అవకాశం ఉండదని భావిస్తున్నారు. కాగా, ఎవరికై నా ప్రమాద బీమా ఉంటే అదే వర్తిస్తుంది. ఇక ఏడు రోజుల చికిత్స అనంతరం ఆరోగ్యశ్రీ వర్తిస్తే పథకం ద్వారా, లేదా కుటుంబ సభ్యులు చెల్లించేలా అదే ఆస్పత్రిలో చికిత్స కొనసాగించే అవకాశముంది.

అమల్లోకి

‘పీఎం రాహత్‌’ పథకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement