జేబుకు చిల్లే | - | Sakshi
Sakshi News home page

జేబుకు చిల్లే

Nov 14 2026 12:35 AM | Updated on Nov 14 2026 12:35 AM

అక్కడ రూ.40 వేలు.. ఇక్కడ రూ.4వేలు

అవసరం లేకున్నా పరీక్షలు,

పరిమితి లేని ఫీజులు

నామమాత్రపు తనిఖీలతో

సరిపెడుతున్న వైద్య, ఆరోగ్య శాఖ

తనిఖీలు నిర్వహిస్తున్నాం..

జబ్బుతో వస్తే

ఖమ్మం రూరల్‌ మండలం తల్లంపాడుకు చెందిన ఓ వ్యక్తిని ఇటీల పాముకాటు వేసింది. ఆయనను ఖమ్మంలోని ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి కొత్త బస్టాండ్‌కు వెళ్లే మార్గంలోని ఓ ఆస్పత్రికి తీసుకురాగా, పరీక్షల అనంతరం విషప్రభావంపై కిడ్నీలకు చేరి క్రియాటిన్‌ స్థాయి పెరిగిందని చెప్పారు. ఒక్కసారి డయాలసిస్‌ చేసేందుకు రూ.40 వేలు చెల్లించాలని చెప్పగా, నిరుపేదలమైన తమ వద్ద అంత డబ్బు లేదంటూ తగ్గించాలని కోరినా నిర్వాహకులు ససేమిరా అన్నారు. సమీపంలోని మరో ఆస్పత్రికి వెళ్తే రూ.4 వేలకే డయాలసిస్‌ చేశారు. ఇలా ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లలో పరీక్షలకు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే ఇలా ఉంటే పట్టణ, మండల కేంద్రాల్లో పరిస్థితిని ఊహించుకోవచ్చు.

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో వైద్యం రోజురోజుకూ వ్యాపారంగా మారుతోంది. ఏదైనా సమస్య ఎదురై ఆస్పత్రికి వెళ్లాలంటే ప్రజలు హడలిపోతున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో ఫీజులపై నియంత్రణ లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్తే చాలు పరీక్షల పేరిట రూ.వేలల్లో చెల్లించాల్సి వస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నామమాత్రంగా సాగుతుండడంతో ప్రజల జేబులకు చిల్లు పడుతోంది.

మొదట పరీక్ష చేయాల్సిందే...

జిల్లా వ్యాప్తంగా సుమారు 522 ప్రైవేట్‌ ఆస్పత్రులు, 60 డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఉన్నాయి. చాలా ఆస్పత్రుల్లో సొంతంగా డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఉండగా, ఇంకొందరు డయాగ్నస్టిక్‌ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆరోగ్య సమస్యతో ఆస్పత్రిలో అడుగుపెట్టగానే బ్లడ్‌ టెస్ట్‌, షుగర్‌, కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌, 2డీ ఎకో, ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌ ఇలా అవసరం ఉన్నా, లేకున్నా పరీక్షలన్నీ చేయక తప్పదని చెబుతుతున్నారు. కేవలం కమీషన్ల ఆశతోనే ఇలా చేస్తున్నారనే విమర్శలు ఉండగా.. ప్రజలు పరీక్షలకే రూ.వేలల్లో చెల్లించాల్సి వస్తోంది.

నియంత్రణ కరువై..

ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లలో పరీక్షలకు సంబంధించి ఫీజులను వైద్య, ఆరోగ్య శాఖ అధికారికంగా ఖరారు చేయలేదు. దీంతో ఆస్పత్రులు, సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తీసుకొచ్చే కుటుంబీకులు ఆందోళనతో అప్పులు చేసి డబ్బు చెల్లించాల్సి వస్తోంది. ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లలో వసూళ్లపై వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

ఎవరినీ వదలట్లే..

ఆస్పత్రులు కార్పొరేట్‌ స్థాయికి చేరడంతో సేవాభావం కన్నా.. డబ్బు దండుకోవడంపైనే దృష్టి సారిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆస్పత్రులకు పేషంట్లను రప్పించేలా కొందరు నిర్వాహకులు ప్రత్యేకంగా మేనేజర్లను నియమించుకోగా, ఇంకొందరు ఆర్‌ఎంపీలకు కమీషన్‌ ఇచ్చి తమ ఏజెంట్లుగా మార్చుకుంటున్నారని తెలిసింది. ప్రధానంగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడే వారికి డయాలసిస్‌ ఖర్చులు తలకు మించిన భారంగా మారుతున్నాయి. డయాలసిస్‌ ఫీజు ఆస్పత్రుల వారీగా వేర్వేరుగా ఉన్నా తప్పనిసరై చేయించుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్దామంటే డయాలసిస్‌ సేవలు పరిమితంగా ఉండడంతో రద్దీ పెరిగి ఆలస్యమవుతోంది.

తనిఖీలు మొక్కుబడేనా..?

అనధికారికంగా, నిబంధనలకు విరుద్దంగా కొనసాగుతున్న ఆస్పత్రులు, ల్యాబ్‌లపై నిఘా పెట్టాల్సిన వైద్య, ఆరోగ్య శాఖాధికారులు మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిలాల్లో వందలాది ఆస్పత్రులు, ల్యాబ్‌లు ఉంటే ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 20 లోపు ఆస్పత్రుల్లోనే తనిఖీ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం, వైద్యాధికారులు స్పందించి ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాల నిర్వహణ ఫీజుల వసూళ్లపై నిఘా వేయాలని పలువురు కోరుతున్నారు.

ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లలో వసూళ్లు

ఏయే టెస్ట్‌కు ఎంత వసూలు చేయాలన్నది అధికారికంగా నిర్ణయించలేదు. కానీ ఎంత వసూలు చేస్తున్నారో ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నసిస్‌ సెంటర్లలో కచ్చితంగా పట్టిక ప్రదర్శించాలి. ఇటీవల ప్రభుత్వం సూచనలతో జిల్లాకు సంబంధించి ఎంత తీసుకోవాలనే వివరాలు సమర్పించాం.

– డి.రామారావు, డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement