ఖమ్మంమయూరిసెంటర్: వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికన హక్కులు దక్కడం లేనందున బహుముఖ పోరాటాలే శరణ్యమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. హక్కులు సాధించేంత వరకు ఐక్యతను ప్రదర్శించాలని కోరారు. బీసీ హక్కుల సాధన సమితి రెండో మహాసభ శుక్రవారం ఖమ్మంలో నిర్వహించారు. ఈ సభలో సత్యం మాట్లాడుతూ బీసీ వర్గాలకు అన్నింటా అన్యాయం జరుగుతోందని తెలిపారు. 1931 నుంచి ఇప్పటి వరకు బీసీలను సంఖ్యాపరంగా తేల్చేందుకు పాలకులెవరూ సుముఖత వ్యక్తం చేయడం లేదని పేర్కొన్నారు. ఇకనైనా బీసీ సామాజిక వర్గాలకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని, జనాభా ప్రాతిపదికన సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. అంతేకాక త్వరలో జరగనున్న జనగణనలో బీసీ సామాజిక వర్గాన్ని ప్రత్యేకంగా లెక్కించాలని విజ్ఞప్తి చేశారు. పోరాడకుండా ఏ వర్గం హక్కులు సాధించలేదని, ఇప్పుడు బీసీలు పోరాడితేనే హక్కులు, సంక్షేమ పథకాలు, రాజ్యాధికారం దక్కుతుందని తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు మాట్లాడుతూ దేశంలో మైనార్టీ ప్రజలు మెజార్టీ ప్రజలను పాలిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ సంఘాల ఒత్తిడితోనే ప్రభుత్వం కులగణన చేపట్టిందని తెలిపారు. అనంతరం బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. ధనుంజయ నాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తదితరులు మాట్లాడగా పార్టీలు, సంఘాల నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, మహ్మద్ మౌలానా, యర్రా బాబు, ఎస్.కే.జానీ మియా, శింగు నర్సింహారావు, మేకల శ్రీనివాసరావు, తాటి వెంకటేశ్వరరావు, పగడాల మల్లేష్, నానబాల రామకృష్ణ, రావి శివరామకృష్ణ, దండు ఆదినారాయణ, బెజవాడ రవి పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం


