ఖమ్మం సహకారనగర్: ఉద్యోగుల పెన్షన్, జీపీఎఫ్, సర్వీస్ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు అకౌంటెంట్ జనరల్ వీ.ఎం.వీ.నావల్ కిషోర్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన అదాలత్, వర్క్‌షాప్‌ను అకౌంటెంట్ జనరల్ కిషోర్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ పెన్షన్ ఆమోదానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే సమాచారం, రికార్డులు ముఖ్యమని తెలిపారు. ఈమేరకు ఆడిట్, తనిఖీల ఫారాలు ఎప్పటికప్పుడు అందిస్తూ, వాటి అభ్యంతరాలపై స్పందిస్తే ఇబ్బంది ఉండదని చెప్పారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వ శాఖల్లో సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన వారితో గౌరవంగా వ్యవహరిస్తూ సమస్యలను సానుకూల ధృక్పథంతో పరిష్కరించాలని తెలిపారు. ఈక్రమాన పెన్షన్, జీపీఎఫ్, ఇతర సర్వీస్ సంబంధిత అంశాలను సులభతరం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌లు ఎం.నరేష్‌కుమార్, కె.శశిధర్, ఖమ్మం, భద్రాద్రి జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్లు వై.శ్రీనివాసరెడ్డి, జె.మీనాక్షి, వివిధ శాఖల అధికారులు మోదుగు వేలాద్రి, ప్రసన్నకుమార్, నాగేంద్రకుమారి, శారద, కృష్ణారావు, సారధి, సునీల్, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, సైదులు, రఫియా సుల్తానా పాల్గొన్నారు.
అకౌంటెంట్ జనరల్ నావల్ కిషోర్


