16న పిల్లల ప్రజావాణి
ఈనెల 19నుంచి బీమా పథకం అమలు
వీడియో కాన్ఫరెన్స్‌లో
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి ఏర్పాట్లను చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్‌తో కలిసి శుక్రవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనుండగా, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈనెల 19నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈమేరకు కులగణన సర్వే ద్వారా కుటుంబాల వివరాలు వివరాలు అందుబాటులో ఉన్నందున ప్రతీ కుటుంబానికి బీమా వర్తించేలా అవసరమైన వివరాలు పక్కాగా నమోదు చేయాలని సూచించారు. వీసీకి జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, సీపీఓ ఏ.శ్రీనివాస్, డీపీఓ జి.వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు
ప్రస్తుతం జిల్లాల్లో నీటి లభ్యత ఆధారంగా యాసంగి పంటల సాగు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ద్వారా మాట్లాడిన ఆయన తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను మళ్లించాలని తెలిపారు. అనంతరం పంటల వైవిధ్యీకరణ, రైతు ఐడీ నమోదు, కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటు, ధాన్యం కొనుగోళ్లు, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, వీజీబీ రామ్‌జీ పథకం అమలు, జనసంచారం ఉండే ప్రాంతాల్లో వీధి కుక్కల కట్టడిపై సూచనలు చేశారు. ఈ వీసీలో కలెక్టర్ దివాకర, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
బలహీన, వెనుకబడిన వర్గాల పిల్లలు వారి సమస్యలు, ఫిర్యాదులను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చేలా ఈనెల 16న సోమవారం కలెక్టరేట్‌లో ‘పిల్లల ప్రజావాణి’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. పిల్ల ల భద్రత, రక్షణ, విద్య, ఆరోగ్యం, పోషణ, అభివృద్ధి, బాలల హక్కులకు సంబంధించ అంశాలపై ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి చొరవ తీసుకుంటామని చెప్పారు. పిల్లలకు సురక్షితమైన, స్నేహపూర్వకమైన వాతావరణం కల్పిస్తూ, వారి గౌరవం, గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.


