ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యావిభాగంలో విలీనం చేయడాన్ని టీఎస్ యూటీఎఫ్ స్వాగతిస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి తెలిపారు. ఖమ్మంలోని యూటీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే క్యాంపస్‌లో నిర్వహిస్తూ, మూడు ముక్కలు చేసినంత మాతాన అమాంతంగా విద్యార్థుల సంఖ్య పెరగదని తెలిపారు. తొలుత ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంచాలని చెప్పారు. అలాకాకుండా విలీనం చేసినందువల్ల కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదన్నారు. కాగా, ఈనెల 15, 16వ తేదీల్లో ముదిగొండలో జరగనున్న యూటీఎఫ్ జిల్లా విద్యా మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
మహాసభలను విజయవంతం చేయాలి
ముదిగొండ: ముదిగొండలో ఈనెల 15, 16వ తేదీల్లో జరిగే టీఎస్ యూటీఎఫ్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు కోరారు. ముదిగొండలో శుక్రవారం వారు విలలేకరులతో మాట్లాడుతూ ప్రారంభ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో పాటు టీఎస్ యూటిఎఫ్ రాష్ట్ర అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావా రవి, వెంకట్ హాజరవుతారని తెలిపారు. ఆహ్వాన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నెల్లూరి వీరబాబు, పెనుబాక సురేష్, వల్లకొండ రాంబాబు, మండల అధ్యక్ష, కార్యదర్శులు వాసం రాంబాబు, సుకాసి సుధాకర్‌రావుతో పాటు విజయ్ తదితరులు పాల్గొన్నారు.


