పెనుబల్లి: అధికారులు చేసిన తప్పిదంతో ఓ మానసిక దివ్యాంగురాలికి ‘చేయూత’ దక్కలేదు. పెనుబల్లి బీసీ కాలనీకి చెందిన బెజవాడ వెంకటేశ్వరరావు కుమార్తె ఉమారాణి మానసిక దివ్యాంగురాలు కాగా మాటలు కూడా సరిగ్గారావు. ఖమ్మం జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన సదరమ్ శిబిరంలో ఆమెకు 90 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. నిరుపేద కుటుంబం కావడంతో చేయూత పింఛన్ కోసం మార్చి 30వ తేదీన దరఖాస్తు చేసుకుంది. తాజాగా పింఛన్లు మంజూరు చేస్తుండడంతో ఆమె పేరు జాబితాలో ఉంటుందని ఆశిస్తే నిరాశే ఎదురైంది. దీంతో ఉమారాణితో కలిసి ఆమె తండ్రి శుక్రవారం పెనుబల్లి మండల పరిషత్ కార్యాలయానికి వచ్చినా ఆరా తీస్తే దరఖాస్తును ఆన్‌లైన్ చేయలేదని తేలింది. ఈ విషయమై ఎంపీడీఓ వీరస్వామిని వివరణ కోరగా కార్యదర్శి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే క్రమాన పొరపాటు జరిగిందని తెలిపారు. తదుపరి జాబితాలో ఆమెకు పింఛన్ మంజూరయ్యే అవకాశముందని చెప్పడం గమనార్హం.
ఉద్యోగుల తప్పిదంతో దక్కని ‘చేయూత’


