● తొలిదశగా జిల్లాలోని 23 పాఠశాలలు ఎంపిక ● ఏర్పాట్లు, నిర్వహణకు రూ.15వేల చొప్పున నిధులు ● రేపు ప్రారంభానికి సన్నాహాలు
జిల్లాలో 23 పాఠశాలల్లో గ్రంథాలయ సంస్థ సహకారంతో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పాఠశాలకు రూ.15 వేలు కేటాయించాం. ఈ నిధులను పుస్తకాలు, ఫర్నీచర్ కొనుగోలుకు ఉపయోగించాల్సి ఉంటుంది.
– వాసంతి, జిల్లా విద్యాశాఖాధికారి
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేలా ఏర్పాటుచేస్తున్న గ్రంథాలయాలను ఈనెల 14న ప్రారంభించనున్నాం. పుస్తక పఠనం పిల్లల్లో భాషా నైపుణ్యాల పెంపునకు దోహదపడుతుంది.
– పెసర ప్రభాకర్‌రెడ్డి, ఏఎంఓ
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపొందించడం, భాషా నైపుణ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో గ్రంథాలయాల ఏర్పాటుకు నిర్ణయించారు. తొలి దశలో జిల్లాలోని 23పాఠశాలలకు ఎంపిక చేయగా, వీటిలో బాలల దినోత్సవం సందర్భంగా శనివారం లైట్రరీలను ప్రారంభించేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. లైబ్రరీల ఏర్పాటుపై డీఈఓ వాసంతి ఈనెల 10న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా గ్రంథాలయాల ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టారు.
పఠనాసక్తి పెంపునకు..
విద్యార్థుల్లో చదివే అలవాటును పెంపొందించడం, భాషా ప్రావీణ్యాన్ని అభివృద్ధి చేయడం, పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచడమే లక్ష్యంగా గ్రంథాలయాల ఏర్పాటుకు నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం అవసరమైన పుస్తకాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. లైబ్రరీలను శుక్రవారం ప్రారంభించనుండగా, గదిని ఎంపిక చేసి పుస్తకాల అమరిక, ఇతర ఏర్పాట్లు చేయాలని ప్రధానోపాధ్యాయులను డీఈఓ ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సమక్షాన గ్రంథాలయాలను ప్రారంభించాలని, విద్యార్థులంతా హాజరయ్యేలా తరగతుల వారీగా టైమ్‌టేబుల్ రూపొందించాని సూచించారు.
పాఠశాలల ఖాతాల్లో నిధులు
జిల్లాలోని 23 పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయనుండగా, గ్రంథాలయ సంస్థ సహకారంతో నిధులు సమకూర్చారు. ఒక్కో పాఠశాలకు రూ.15వేల చొప్పున కేటాయించగా... ఇప్పటికే పలు పాఠశాలల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ నగదును కావాల్సిన పుస్తకాలు, సామగ్రి కొనుగోళ్లు, ప్రారంభోత్సవ ఏర్పాట్లకు వెచ్చించాల్సి ఉంటుంది. అంతేకాక ప్రతీనెల రూ.వేయి చొప్పున విడుదలయ్యే గ్రాంట్‌తో అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేయనున్నారు.
ఏయే పాఠశాలల్లో...
జిల్లాలో లైబ్రరీల ఏర్పాటుకు తొలి దశలో 23పాఠశాలలను ఎంపిక చేయగా, అత్యధికంగా ఖమ్మం అర్బన్ మండలంలోని 11 పాఠశాలలు ఉన్నాయి. కొన్ని మండలాలకు చోటు దక్కకపోగా, దశల వారీగా అన్ని పాఠశాలల్లో ఏర్పాటుచేసే అవకాశముంది. ఖమ్మం అర్బన్ మండలంలోని ఎన్నెస్సీ కాలనీ, ఇందిరానగర్ కాలనీ, శాంతినగర్, మామిళ్లగూడెం, రాజేంద్రనగర్, నయాబజార్, గాంధీనగర్, రిక్కాబజార్ ప్రభుత్వ హైస్కూళ్లు ఉన్నాయి. అలాగే, రోటరీనగర్, పాండురంగాపురంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లు, ఖమ్మంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్‌ను కూడా ఎంపిక చేశారు. ఇక ఖమ్మం రూరల్ మండలంలోని జలగంనగర్, గోళ్లపాడు – పోలేపల్లి, తిరుమలాయపాలెంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటుచేస్తారు. ఇవికాక సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారం, అయ్యగారిపేట ప్రభుత్వ పాఠశాలలు, అయ్యగారిపేట జెడ్పీహెచ్‌ఎస్(బాలికలు), కాకర్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌తో పాటు కొణిజర్ల, తనికెళ్ల జెడ్పీహెచ్‌ఎస్‌లు, మధిర ప్రభుత్వ హైస్కూల్, జెడ్పీహెచ్‌ఎస్((హెచ్‌డబ్ల్యూ)తో పాటు చింతకాని మండలం కొదుమూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో లైట్రరీలు ఏర్పాటు చేయనున్నారు.


