ఖమ్మం వైద్యవిభాగం: హెచ్‌ఐవీ బాధితులు, నిరుపేదలకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల ట్రస్ట్ ఆధ్వర్యాన గురువారం పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఖమ్మంలో జరిగిన ఈ కార్యక్రమానికి డీఎంహెచ్‌ఓ రామారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ట్రస్ట్ సభ్యులు 15 ఏళ్లుగా క్రమం తప్పకుండా కిట్లు అందిస్తుండడం అభినందనీయమన్నారు. బాధితులు చికిత్స చేయించుకుంటూనే సరైన పౌష్టికాహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈక్రమాన దాతలు, స్వచ్ఛంద సంస్థలు మరింతగా ముందుకు రావాలని కోరారు.
బేతుపల్లి చెరువును
పరిశీలించిన డీఐజీ
సత్తుపల్లిటౌన్: వారం క్రితం భారీ వరద ముంచెత్తడంతో సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువులో మత్స్యకారులు చిక్కుకోవడం, వారిని రక్షించేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోల్తా పడడంతో రెస్క్యూ ఆపరేషన్‌తో రక్షించిన విషయం విదితమే. ఈమేరకు చెరువును బెటాలియన్ల డీఐజీ పి.మురళీకృష్ణ గురువారం పరిశీలించారు. కాకర్లపల్లి వైపు ఉన్న అలుగు, బేతుపల్లి అలుగు ప్రాంతాలతో పాటు మత్స్యకారులు చిక్కుకున్న ప్రాంతాన్ని పరిశీలించి రెస్క్యూ ఆపరేషన్ వివరాలు తెలుసుకున్నారు. గంగారం బెటాలియన్ అదనపు కమాండెంట్లు ఏ.అంజయ్య, బి.సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీమా ప్రీమియం
చెల్లింపులకు విరామం
ఖమ్మంగాంధీచౌక్: తపాలాశాఖలో పీఎల్‌ఐ, ఆర్పీ ఎల్‌ఐ సేవలను ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్ నుంచి కొత్త సాఫ్ట్‌వేర్‌కు మారుస్తున్నారు. ఈమేరకు పాలసీదారులు ప్రీమియం నగదును ఈనెల 15వ తేదీ లోపు చెల్లించాలని అధికారులు కోరారు. ఈనెల 16నుంచి 24వ తేదీ వరకు ప్రీమియం చెల్లింపులకు అవకాశం ఉండదని, తిరిగి 25వ తేదీ నుంచి కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
వృద్ధురాలి మెడలో
గొలుసు చోరీ
ఖమ్మంఅర్బన్: ఖమ్మం ప్రశాంతినగర్‌లో వృద్ధురాలి మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రెండు తులాల బంగారు గొలుసు చోరీ చేశారు. ఆమె గురువారం తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సమయాన ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు.
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
చింతకాని: మండలంలోని చిన్నమండవలో మున్నేటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు గురువారం సీజ్ చేశారు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఇసుక తరలింపునకు అనుమతి లేదని తేలడంతో వాహనాలను సీజ్ చేసి, బాధ్యులపై కేసు నమోదు చేశామని ఎస్సై నరేష్ తెలిపారు.


