● ప్రభుత్వం దృష్టికి వడ్డీ రాయితీ, మారిటోరియం ప్రతిపాదనలు ● డీసీసీబీ మహాజన సభలో కలెక్టర్ దివాకర
ఖమ్మంవ్యవసాయం: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా పంట రుణాలపై వడ్డీ రాయితీ, మారిటోరియం ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పీఐసీ కమిటీ చైర్మన్, కలెక్టర్ దివాకర టీ.ఎస్ తెలిపారు. డీసీసీబీ 129వ మహాజనసభ గురువారం ఖమ్మంలోని ప్రధాన కార్యాలయంలో జరిగింది. తొలుత 2025–26 వార్షిక నివేదిక, ఖర్చులు, లాభాల కేటాయింపులు, స్టాట్యూటరీ ఆడిట్ రిపోర్ట్‌ను సభ్యులు ఆమోదించారు. అనంతరం మోటాపురం పీఏసీఎస్ అధ్యక్షుడు భాగం హేమంతరావు మాట్లాడుతూ ఎల్‌నినోతో వర్షాలు లేక రైతులు నష్టపోయినందున వ్యవసాయ రుణాలకు కేంద్ర ప్రభుత్వం మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 4శాతం రాయితీ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. మరికొందరు మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యాన రైతుల రుణాలకు మారిటోరియం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. వీటిని కలెక్టర్ దివాకర స్పందిస్తూ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు.
పలు అంశాలకు ఆమోదం
అదనపు అజెండాగా ‘ఏ’ క్లాస్ సంఘాలకు 2025–26 సంవత్సరానికి డివిడెండ్ చెల్లింపు, ఉద్యోగులకు ఇన్సెంటివ్ ఇచ్చే అంశాలపై చర్చించారు. పీఏసీఎస్‌ల ద్వారా ఆయిల్‌పామ్ గెలల కలెక్షన్ సెంటర్లు ప్రారంభించాలని, సోలార్ ప్లాంట్లను స్థాపించి సంఘానికి విద్యుత్ వ్యాపార అవకాశం కల్పించాలని కోరారు. అలాగే, ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తే రైతులను దళారుల నుంచి రక్షించొచ్చని తెలిపారు. మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు మామిడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వర్షాభావంతో మత్స్యకారుల జీవనోపాధిపైనా దెబ్బపడినందున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరారు. కాగా, బేతుపల్లి చెరువు వరదలో చిక్కుకున్న మత్స్యకారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేలా రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన కలెక్టర్ పనితీరును అధ్యక్షులు అభినందించారు. అనంతరం బ్యాంకు సీఈఓ ఎన్.వెంకటఆదిత్య మాట్లాడుతూ ప్రతీ నిర్ణయం రైతు శ్రేయస్సు కోరేలా, సంఘాలకు లాభం చేకూర్చేలా ఉంటుందని పేర్కొన్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల సహకార అధికారులు జి.గంగాధర్‌రావు, ఏ.శ్రీనివాసరావు, ఖమ్మం డీఏఓ ధనసరి పుల్లయ్య, బ్యాంకు డీజీఎం జి.ఉదయశ్రీ, అధికారులు జి.వేణుగోపాల్ రావు, ఎం.సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


