సీ్త్ర నిధి రుణాల్లో అక్రమాల కలకలం
● సొంతానికి వాడేసుకుంటున్న గ్రామ దీపికలు, లీడర్లు ● సామాజిక తనిఖీల్లో బయటపడుతున్న బాగోతం ● తాజాగా పెనుబల్లి, ఏన్కూరు మండలాల్లో రూ.78.57 లక్షలు స్వాహా
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో ‘సీ్త్రనిధి’ రుణాల రికవరీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మహిళా సంఘాల సభ్యులు చెల్లించిన రుణ వాయిదాలను గ్రామదీపికలు, లీడర్లు బ్యాంకుల్లో జమ చేయకుండా చేతివాటం చూపిస్తున్నారు. అయితే, రుణాలు సక్రమంగా రికవరీ కాకపోవడం, వాయిదాలు రాబట్టడంలో జాప్యం నేపథ్యాన బకాయిలు ఎక్కువగా ఉన్న వీఓ(విలేజ్ ఆర్గనైజేషన్)ల పరిధిలో అధికారులు సామాజిక తనిఖీ చేపడుతుండగా అవకతవకలు బయట పడుతున్నాయి. తాజాగా పెనుబల్లి, ఏన్కూరు మండలాల్లోని ఆరు వీఓల్లో రూ.78.57 లక్షల నగదు స్వాహా అయినట్లు తేలింది.
ఆర్థిక భరోసా కోసం..
స్వయం సహాయక సంఘాల్లో సభ్యుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం సీ్త్రనిధి పథకాన్ని తీసుకొచ్చింది. చిరు వ్యాపారాల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేసి ఇబ్బంది పడకుండా, తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. సభ్యులైన మహిళల చిన్న తరహా వ్యాపారాలు, జీవనోపాధి కార్యకలాపాలకు తోడ్పడడం, తద్వారా వారి కుటుంబ ఆదాయాన్ని పెంచేలా బ్యాంకుల నుంచి రుణాల మంజూరులో ఆలస్యం జరిగినప్పుడు ప్రత్యామ్నాయంగా నిధులు సమకూర్చడం లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తోంది. సీ్త్ర నిధి ద్వారా ఏటా సుమారు 9–11 శాతం వడ్డీకే రుణాలు ఇస్తుండగా, రకాల ఆధారంగా 12–36 నెలల వాయిదాల్లో చెల్లించవచ్చు.
అవకతవకల గుట్టురట్టు
స్వయం సహాయక సంఘాల సభ్యుల అవసరాలను ఆధారంగా ‘సీ్త్రనిధి’ ద్వారా రుణాలు అందజేస్తారు. రుణం తీసుకున్న వారు ప్రతీనెల వాయిదాలను గ్రామ దీపికలు, లీడర్లకు చెల్లిస్తే వారు సమాఖ్య సంఘాల ఖాతాల్లో జమ చేయాలి. కానీ కొందరు గ్రామదీపికలు, లీడర్లు సొమ్మును బ్యాంక్‌ల్లో జమ చేయకుండా సొంతానికి వాడుకుంటున్నారు. దీంతో రికవరీ శాతం తక్కువగా ఉంటోంది. నిబంధనల ప్రకారం ఏటా ఆడిట్ నిర్వహిస్తే ఇలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు. కానీ కొన్నేళ్లుగా తనిఖీలు లేకపోవడంతో గ్రామదీపికలు, లీడర్లదే ఇష్టారాజ్యంగా మారింది.
రూ.76.15 కోట్ల బకాయిలు
జిల్లా వ్యాప్తంగా సీ్త్రనిధి ద్వారా ఇచ్చిన రుణాల్లో రూ.76,15,01,000 పేరుకుపోయాయి. ఇందులో సెర్ప్ నుంచి రూ.61,89,06,000 రావాల్సి ఉండగా.. మెప్మా ద్వారా రూ.14,25,95,000 బకాయి ఉన్నాయి. రుణాలు రికవరీ శాతం చాలా తక్కువగా ఉంటోంది. సత్తుపల్లి మండలంలోఅత్యధికంగా రూ.5.35 కోట్లు, ఏన్కూరు మండలంలో రూ.5.03 కోట్ల బకాయిలు ఉన్నాయి. దీంతో అత్యధిక బకా యి ఉన్న ప్రాంతాలపై అధికారులు దృష్టి పెట్టారు.
సామాజిక తనిఖీల్లో వెలుగులోకి..
సీ్త్రనిధి బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయిన నేపథ్యాన సభ్యులకు నోటీసులు జారీచేస్తే తాము క్రమం తప్పక చెల్లిస్తున్నామనే సమాధానాలు రావడంతో అధికారుల్లో అనుమానాలు వ్యక్తమయ్యా యి. దీంతో సీ్త్రనిధి రుణాల లావాదేవీలపై సామాజిక తనిఖీకి నిర్ణయించారు. మొదటి విడతగా నేలకొండపల్లి, కల్లూరు, కామేపల్లి తదితర మండలాల్లోని పలు వీఓల పరిధిలో తనిఖీ చేపట్టగా.. దాదాపు రూ.కోటి మేర పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఇదే క్రమాన గత నెల నుంచి రెండో దఫా తనిఖీలు చేపట్టారు. పెనుబల్లి, ఏన్కూరు మండలాల్లోని ఆరు వీఓల పరిధిలో ఇప్పటి వరకు సామాజిక తనిఖీ పూర్తికాగ,ఆ రూ.78.57 లక్షల నగదును గ్రామదీపికలు, లీడర్లు సొంతానికి వాడుకున్నట్లు తేలింది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మహిళా సభ్యులకు రుణాలు చేరకుండానే ఆర్పీలు పక్కదా రి పట్టించిన ఘటనలు గతంలో వెలుగు చూశాయి. ప్రస్తుతం గ్రామదీపికలు, లీడర్ల అక్రమాలు బయటపడడంతో కేసుల నమోదుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే, జిల్లా అంతటా పూర్తిస్థాయిలో తనిఖీ నిర్వహిస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశముంది.


