లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం | - | Sakshi
Sakshi News home page

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం

Nov 12 2026 12:07 AM | Updated on Nov 12 2026 12:07 AM

ఖమ్మం వైద్యవిభాగం: లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని అవగాహన కల్పించడంతో పాటు పీసీపీఎన్‌డీటీ చట్టం జిల్లాల్లో పకడ్బందీగా అమలయ్యేలా అధికారులు కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ రామారావు సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన జిల్లా సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్లు, స్కానింగ్‌ సెంటర్లు నిబంధనలు పాటించేలా పర్యవేక్షించాలని తెలిపారు. సెంట ర్ల నిర్వాహకులు రిజస్ట్రేషన్‌ చేయించుకోవడంతో పాటు ప్రతీ గర్భిణి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడినట్లు తేలితే కేంద్రాల రిజిస్ట్రేషన్‌ రద్దు చేయడమే కాక నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ వేణుమాధవరావు, ప్రోగ్రాం అధికారులు వేణుగోపాల్‌రెడ్డి, అరుణాదేవి, జీజీహెచ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాధిక, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ హరిప్రసాద్‌, జాగృతి ఎన్‌జీఓ అధ్యక్షురాలు కుముదిని తదితరులు పాల్గొన్నారు.

మరింత పటిష్టంగా పోలీసు పరిపాలన

● పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌

ఖమ్మంక్రైం: పోలీసు స్టేషన్లలో పరిపాలనను మరింత పటిష్టం చేయడమే కాక ఉద్యోగుల విధుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా అధికారులు దృష్టి సారించాలని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ సూచించారు. ఖమ్మం నగర ఏసీపీ కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేసిన ఆయన పెండింగ్‌ కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ కేవలం కార్యాలయ స్థాయిలోనే కాకుండా క్షేత్ర స్దాయిలోనూ స్టేషన్‌ వారీగా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ స్టేషన్‌ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితి, పెండింగ్‌ కేసుల, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం ఆయన ఏసీపీ కార్యాలయ ఆవరణలో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఏసీపీ రమణమూర్తి, సీఐలు సాదిక్‌పాషా, రామకృష్ణ, చిట్టిబాబు పాల్గొన్నారు.

విదేశీయులకు వసతి కల్పిస్తే జాగ్రత్తలు తప్పనిసరి

ఖమ్మంక్రైం: విదేశీ పౌరులకు వసతి కల్పించే సమయాన ఇళ్ల యజమానులు నిబంధనలు పాటించడమే కాక తగిన జాగ్రత్తలు తీసుకోవా లని ఖమ్మం సీపీ సునీల్‌దత్‌ సూచించారు. ఈమేరకు హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, హోమ్‌ స్టేలు, పేయింగ్‌గెస్ట్‌ కేంద్రాలు, హాస్టళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, మతపరమైన వసతి కేంద్రాల నిర్వాహకులకు ఆయన సూచనలు చేశారు. విదేశీ పౌరులకు వసతి కల్పించే వ్యక్తులు, సంస్థల యజమానులు పూర్తి వివరా లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చట్టప్రకారం జరిమానా, జైలుశిక్ష విధించే అవకాశముందని తెలిపా రు. విదేశీ పౌరుల రాకపోకలు, బస చేసిన సమ యం వివరాలతో సహా ఆన్‌లైన్‌లో సమర్పించేలా అధికారిక పోర్ట్‌లో ముందుగా నమోదు చేసుకుని లాగిన్‌ వివరాలు పొందాలని పేర్కొన్నారు. అంతేకాక విదేశీయుల వివరాలను కనీసం ఏడాదిపాటు భద్రపర్చాలని తెలిపారు.

ఆరుతడి పంటలపై

రైతులకు అవగాహన

ఖమ్మంవ్యవసాయం: ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన అధికారులతో యాసంగి పంటల సాగు, తాగునీటి సరఫరా, ప్రత్యామ్నాయ ప్రణాళికలపై అధికారులతో సమీక్షించారు. పాలేరు రిజర్వాయర్‌లో మూడు నెలలు, వైరా రిజర్వాయర్‌లో ఐదు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ తాగునీటికి ఇబ్బంది రాకుండా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే, వరి, మొక్కజొన్న వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు కాకుండా ఆరు తడి పంటలే సాగు చేసేలా కళాజాత బృందాలు, మెసేజ్‌ల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక శాఖల అధికారులు ధనసరి పుల్లయ్య, ఎం.వీ.మధుసూదన్‌, డాక్టర్‌ పురంధర్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ వాణిశ్రీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement