24,270 మందికి ‘చేయూత’ | - | Sakshi
Sakshi News home page

24,270 మందికి ‘చేయూత’

Nov 12 2026 12:07 AM | Updated on Nov 12 2026 12:07 AM

● కొత్త లబ్ధిదారులకు నేటి నుంచి మంజూరు పత్రాల పంపిణీ ● జాబితాలో అత్యధికంగా 12,485 మంది వితంతువులు ● వృద్ధాప్య కేటగిరీలో దక్కని అవకాశం

మండలాలు, కేటగిరీల వారీగా కొత్త లబ్ధిదారులు

8లో

● కొత్త లబ్ధిదారులకు నేటి నుంచి మంజూరు పత్రాల పంపిణీ ● జాబితాలో అత్యధికంగా 12,485 మంది వితంతువులు ● వృద్ధాప్య కేటగిరీలో దక్కని అవకాశం

ఖమ్మం మయూరిసెంటర్‌: నిరుపేదలకు అండగా నిలిచేలా ప్రభుత్వం అందిస్తున్న చేయూత (ఆసరా) పెన్షన్ల కోసం జిల్లాలోని దరఖాస్తుల సుదీర్ఘ ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది. దసరా కానుకగానే కొత్త పెన్షన్లు వస్తాయని భావించినా జాప్యం జరిగింది. అధికారుల బృందం పలు దఫాలుగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఇచ్చిన నివేదికతో ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకు సమ్మతి తెలిపింది. ఈమేరకు జిల్లాలో 24,270 మంది నిరుపేదలకు కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయి. ఇప్పటికే జిల్లా నుంచి వివిధ కేటగిరీల్లో 1,75,724 మంది లబ్ధిదారులు ఉండగా, కొత్త వారితో కలిపి 1,99,994 మందికి పెన్షన్లు అందనున్నాయి. పాత వారితో పాటే కొత్త లబ్ధిదారులకు సైతం ఈనెల 19న ఖాతాల్లో పెన్షన్‌ నగదు జమ కానుంది.

18వరకు పత్రాల పంపిణీ

నూతన లబ్ధిదారులకు గురువారం నుంచి పింఛన్‌ మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు. ఈనెల 18వ తేదీ నాటికి పత్రాల పంపిణీ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పండగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించేలా కలెక్టర్‌ ఆదేశాలతో డీఆర్‌డీఏ అధికా రులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులు నిర్ణయించారు. ఖమ్మం నగర పాల క సంస్థతో పాటు మున్సిపాలిటీలు, అన్ని మండలాల అధికారులకు ఇప్పటికే లబ్ధిదారుల జాబితా లు పంపించారు. దీంతో స్థానిక అధికారులు ఎమ్మెల్యేలను సంప్రదించి పత్రాల పంపిణీ తేదీలు ఖరారు చేయాల్సి ఉంటుంది.

ఐదు విభాగాల్లో లబ్ధి..

79 మంది చేనేత కార్మికులు

ఈ దఫా మంజూరైన పెన్షన్లలో అత్యధికంగా వితంతువులే ఉన్నారు. ఐదు విభాగాల్లో పెన్షన్లు మంజూరు చేయగా, వితంతు కేటగిరీలోనే 12,485 మందికి చోటు దక్కింది. బాసటగా నిలిచే వారు లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వితంతువులకు ఈ పింఛన్‌ ఊరటగా నిలవనుంది. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులకు సైతం పెన్షన్లు మంజూరు కాగా, వృద్ధాప్య కేటగిరీలో దరఖాస్తుదారులకు మాత్రం నిరాశే ఎదురైంది. అలాగే, చేనేత కార్మికులకు సైతం అతి తక్కువగా పింఛన్లు మంజూరయ్యాయి. ఖమ్మం రూరల్‌ మండలం నుంచి అత్యధికంగా 28మందికి చోటు దక్కగా, చింతకాని మండలంలో 18మంది, ఎర్రుపాలెం మండలంలో 11మంది, తిరుమలాయపాలెం మండలంలో 12మంది, మధిర మండలంలో ఎనిమిది మంది, నేలకొండపల్లి మండలం నుంచి ఇద్దరు ఉన్నారు.

మధిరలో అధికం..

మధిర నియోజకవర్గానికి కొత్త పెన్షన్లు అధికంగా మంజూరైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మధిర నియోజవకర్గంలో 5,558 మందికి పెన్షన్లు మంజూరయ్యాయి. ఇక పాలేరులో 5,274, సత్తుపల్లిలో 4,887, ఖమ్మం 4,189, వైరా 3,747 మందికి, ఇల్లెందు నియోజకవర్గ పరిధి కామేపల్లి మండలంలో 615 కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement