ఆర్‌టీసీ.. అలర్ట్‌! | - | Sakshi
Sakshi News home page

ఆర్‌టీసీ.. అలర్ట్‌!

Nov 11 2026 12:19 AM | Updated on Nov 11 2026 12:19 AM

ఉమ్మడి జిల్లాలో

‘స్పెషల్‌ డ్రైవ్‌’..

కండక్టర్‌ ప్రవళిక విషాదాంతంతో

‘డోర్‌ సేఫ్టీ’

బస్సు తలుపులు మూశాకే ముందుకు!

రీజియన్‌లోని 652 బస్సుల

తలుపుల ఫిట్‌నెస్‌పై దృష్టి

ఇప్పటికే 28 బస్సుల్లో తనిఖీ,

పదింటి తలుపుల మరమ్మతు

డోర్లు పనిచేసేలా చర్యలు..

ఖమ్మం మయూరిసెంటర్‌: మణుగూరు ఆర్టీసీ డిపో కండక్టర్‌ ప్రవళిక విధి నిర్వహణలో ఉండగా, మహిళా ప్రయాణికురాలు తోయడంతో కిందపడి తీవ్ర గాయాలతో కన్నుమూసిన ఘటన అందరినీ కలిచి వేసింది. ఆ సమయంలో బస్సుకు తలుపు ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఆర్‌టీసీ యాజమాన్యం మేల్కొని భవిష్యత్‌లో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కావొద్ద నే ఉద్దేశంతో తక్షణ చర్యలకు ఉపక్రమించింది.

ప్రమాదాలకు చెక్‌ పెట్టేలా...

కండక్టర్ల రక్షణతో పాటు ప్రయాణికుల సురక్షిత ప్రయాణాన్ని కాపాడేందుకు ఆర్టీసీ అధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో లేదా సాంకేతిక లోపాల వల్ల డోర్లు సరిగా లేని బస్సులను గుర్తించి, వాటన్నింటికీ వెంటనే కొత్త డోర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రయాణికులు స్టేజీ వద్ద బస్సు ఎక్కిన వెంటనే కండక్టర్‌ లేదా డ్రైవర్‌ డోర్‌ పూర్తిగా వేసిన తర్వాతే బస్సును ముందుకు కదిలించాలని కొత్త నిబంధన తెచ్చారు. రన్నింగ్‌లో డోర్లు తెరిచి ఉంచడంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

భద్రతపై హర్షం

సహచర కండక్టర్‌ ప్రవళికను కోల్పోవడంపై ఉమ్మడి జిల్లాలోని ఆర్‌టీసీ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఘోర సంఘటన కలిచివేసినా, ఆలస్యంగానైనా ఆర్టీసీ యాజమాన్యం బస్సులకు డోర్‌ భద్రతను నిర్బంధం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కార్మిక సంఘాలు, ప్రయాణికులు హర్షిస్తున్నారు. రద్దీ వేళల్లో ప్రయాణించే వారి ప్రాణాలకు ఈ డోర్‌ సిస్టమ్‌ ఎంతో రక్షణ ఇస్తుందని భావిస్తున్నారు.

ఈ నిర్ణయం నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఏడు ఆర్టీసీ బస్‌ డిపోల్లో అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మొత్తం 652 బస్సులలో డోర్ల పనితీరు, ల్యాచెస్‌ (తాళాలు), సేఫ్టీ గ్రిల్స్‌ను మెకానికల్‌ విభాగాలు పరిశీలిస్తున్నాయి. పాడైపోయిన డోర్లను వెంటనే బాగు చేయడం, తలుపులు లేని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు తక్షణమే కొత్త డోర్లను అమర్చే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ఇప్పటివరకు 28 బస్సులను తనిఖీ చేయగా.. పదింటి తలుపులను సరిచేశారు. మిగతా వాటి పరిశీలన కూడా కొనసాగుతోంది.

ఖమ్మం రీజియన్‌ పరిధిలోని ఏడు డిపోల్లోని బస్‌ల డోర్లు పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. ఈ డిపోల పరిధిలోని బస్‌ల డోర్లను పరిశీలన చేయిస్తున్నాం. దీనిపై కండక్టర్లకు కూడా అవగాహన కల్పిస్తాం. డోర్‌ క్లోజ్‌ చేయకుండా స్టేజి నుంచి ముందుకు కదలొద్దని ఆదేశిస్తాం.

– ఏ.సరిరామ్‌, ఆర్‌ఎం, ఖమ్మం రీజియన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement