సూపర్‌బజార్(కొత్తగూడెం): సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువుకు ఇటీవల భారీగా వరద వచ్చిన సమయాన చిక్కుకున్న మత్స్యకారులను రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని తెలంగాణ స్పెషల్ పోలీస్ డీఐజీ పి. మురళీకృష్ణ అభినందించారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ఆరో బెటాలియన్‌లో ఉద్యోగులకు ఆయన మంగళవారం ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మత్స్యకారులను రక్షించిన ఉద్యోగుల ధైర్యసాహసాలు అభినందనీయమని కొనియాడారు. చాతకొండ, గంగారం బెటాలియన్ల కమాండెంట్లు పీసీవీ.రమణ, పెద్ద బాబు, అధికారులు ఎస్.శ్రీధర్‌రాజా, ఏ.వీ.రమణయ్య, శోభన్‌బాబు, జె.లెనిన్‌బాబు, సీహెచ్‌వీ.శ్రీనివాసరెడ్డి, జీ.వీ.రామారావు, బి.జానయ్య తదితరులు పాల్గొన్నారు.
రేక్ పాయింట్‌కు
కాంప్లెక్స్ ఎరువులు
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు మంగళవారం ఐపీఎల్ కంపెనీకి చెందిన కాంప్లెక్స్ ఎరువులు చేరాయి. ఇందులో డీఏపీ 1,209.80 మెట్రిక్ టన్నులు, పొటాష్ 127.70 మెట్రిక్ టన్నులు ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు. వీటిని కోటా వారీగా ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాకు చేరవేసినట్లు వెల్లడించారు.
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి ఆమోదం
మణుగూరు ఓసీ ప్రభావిత
లబ్ధిదారులకు రూ.8.19 కోట్లు
మణుగూరు టౌన్: మణుగూరు ఓపెన్‌కాస్ట్ విస్తరణ ప్రభావిత ప్రజలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద పరిహారం మంజూరుకు ఆమోదం లభించింది. కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో రూ.8.19 కోట్ల పరిహారం చెల్లింపునకు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో మణుగూరుకు చెందిన 71 కుటుంబాల్లోని 149 మంది లబ్ధిదారులకు రూ.5.50లక్షల చొప్పున పరిహా రం అందనుంది. అర్హులైన కుటుంబాలకు పారదర్శకంగా పరిహారం అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, ఐటీడీఏ పీఓ రాహుల్ పాల్గొన్నారు.
నేటి నుంచి సింగరేణి స్థాయి క్రికెట్ సమరం
రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో సింగరేణి స్థాయి క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీలు బుధవారం ప్రారంభం కానున్నాయి. మూడురోజుల పాటు ఠాగూర్ స్టేడియం, మందమర్రి సింగరేణి స్కూల్ మైదానంలో పోటీలు జరుగుతాయి. మందమర్రి – బెల్లంపల్లి సంయుక్త జట్టు, శ్రీ రాంపూర్ జట్టు, ఇల్లెందు – మణుగూరు సంయుక్త జట్టు, ఆర్‌జీ–1, ఆర్‌జీ–2 సంయుక్త జట్టు, ఆర్‌జీ –3, భూపాలపల్లి సంయుక్త జట్టు, కొత్తగూడెం కార్పొరేట్ జట్టు పోటీల్లో పాల్గొననున్నాయి. ఆరు జట్లను రెండు పూల్స్‌గా విభజించి లీగ్ పోటీలు నిర్వహిస్తారు. లీగ్ మ్యాచ్‌ల అనంతరం రెండు పూల్స్‌లో అగ్రస్థానాన నిలిచిన జట్లు ఫైనల్స్‌లో తలపడుతాయి.


