ఖమ్మంమయూరిసెంటర్: ఎల్‌నినోతో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితుల్లో రైతు, కూలీలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాగం హేమంతరావు ఆరోపించారు. మూడు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్‌నినోకు సంబంధించి ప్రకటనలు చేస్తున్నాయి తప్ప చర్యలు చేపట్టడం లేదన్నారు. ఖమ్మంను కరువు జిల్లాగా ప్రకటించడంతో పాటు రైతులు, వ్యవసాయ కార్మికులకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని, రైతుల రుణాలపై వడ్డీ మాఫీ చేయడంతో పాటు మురసు బాధితులను ఆదుకోవాలనే డిమాండ్‌తో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన ఆందోళనలో హేమంతరావు మాట్లాడుతూ.. కేంద్రాన్ని రూ.25 వేల కోట్లు అడిగిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు వచ్చేంత వరకు ఆగకుండా తక్షణం పనులు ప్రారంభించాలన్నారు. రైతులను ఆదుకునేందుకు రుణా లపై వడ్డీ మాఫీచేసి నూతనంగా రుణా లు, కరువుతో పంటలు సాగు చేయని, సాగు చేసి నష్టపోయిన వారు, తుపాన్లతో పంటలు దెబ్బతిన్న వారికి పరిహా రం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాక వీబీజీ రాంజీ పథకం కింద పనులు ప్రారంభించి పనిదినా లు, కూలీ పెంచాలన్నారు. అనంతరం వినతి పత్రాన్ని కలెక్టరేట్‌లో అధికారులకు అందజేశారు. నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎస్‌కె.జానీమియా, ఏపూరి లతా దేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, శింగు నర్సింహారావు, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, దొండపాటి రమేష్, తోట రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


