ఖమ్మం రాపర్తినగర్: సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణాను అరికట్టేలా యువత పోరాడాలని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి సూచించారు. ఖమ్మంలోని కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలలో మంగళవారం వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగ విలువలపై అందరూ అవగాహన పెంచుకుని, సమాజానికి ఏ మేరకు ఉపయోగపడుతున్నామో బేరీజు వేసుకోవాలని తెలిపారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి మాట్లాడుతూ యువత తమ శక్తియుక్తులను సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని తెలిపారు. మై భారత్ జిల్లా అధికారి ఎం.రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యువత అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం మత్తు పదార్థాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై యువతీ, యువకులు చేపట్టిన చర్చ ఆసక్తికరంగా కొనసాగింది. ఎన్‌ఎస్‌ఎస్ జిలాల కోఆర్డి నేటర్ శ్రీనివాసరావు, కేఎండీసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వీ.రమణరావు పాల్గొనగా యూత్ పార్లమెంట్ జడ్జిలుగా భాను, ఎన్.మాధవి, స్పందన వ్యవహరించారు. అనంతరం విజేతలుగా నిలిచిన ఎం. డీ.నదియా ఆస్రిన్, కె.వినీల, ఎం.డీ.అషేయా తహూరా, పి.లక్ష్మీప్రియకు బహుమతులు అందజేశారు.


