కామేపల్లి: మండలంలోని కొండాయిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సోమవారం వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు తనిఖీ చేశారు. రాష్ట్ర సహకార సెంట్రల్ బ్యాంక్ డీజీఎం రవికాంత్‌రెడ్డి, మేనేజర్ హేమంత్, డీసీసీబీ ఏజీఎం కె.రాధిక, మేనేజర్ సృజనమాల ఆధ్వర్యాన తనిఖీ చేయగా సంఘం లావాదేవీలు, డిపాజిట్లు, రుణ వివరాల రికార్డులు పరిశీలించారు. పనితీరు, రైతులకు అందిస్తున్న సేవలను పీఏసీఎస్ చైర్మన్ ధనియాకుల హన్మంతరావు, సీఈఓ డి.ముత్తయ్య వివరించారు. సూపర్‌వైజర్లు అలీమ్, సీహెచ్.నాగరాజు, సిబ్బంది సలీమ్, రమేష్, రామారావు పాల్గొన్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో
ఇల్లు దగ్ధం
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. మున్సిపాలిటీ 26వ వార్డుకు చెందిన వృద్ధురాలు బానోతు అమ్మి ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆమె ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు తెలుస్తుండగా, హీటర్ పెద్ద శబ్దంతో పేలిపోగా మంటలు వేగంగా వ్యాపిస్తూ సామగ్రి మొత్తం కాలి బూడిదయ్యాయి. ఘటన సమయాన అమ్మి ఇంటి బయట ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. ఈమేరకు స్థానికులు మంటలు ఆర్పివేయడంతో చుట్టుపక్కల ఇళ్లకు నష్టం తప్పినట్లయింది. ఘటనలో రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరగగా, సామగ్రి మొత్తం కాలిపోవడంతో బాధితురాలు రోడ్డున పడింది. విద్యుత్ ఏఈ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ ప్రమా కారణాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
పైప్‌లైన్ లీకేజీతో
పంటలకు నష్టం
రఘునాథపాలెం: మండలంలోని బూడిదంపాడులో పైప్‌లైన్ లీకేజీలు రైతులకు శాపంలా మారాయి. మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్ జలాలను చెరువుల్లో నింపేందుకు పైప్‌లైన్ ఏర్పాటుచేశారు. అయితే, పలుచోట్ల లీకేజీలతో నీరు పత్తి, మిర్చి చేన్లలో నిలిచి పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. గ్రామానికి చెందిన రైతు వల్లభనేని వెంకటేశ్వర్లు వ్యవసాయ భూమి మధ్యలో నుంచి పైప్‌లైన్ వేయగా, ప్రస్తుతం అది పలుచోట్ల లీకవడంతో పంటలకు నష్టం వాటిల్లుతోందని తెలిపారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
వేద పండితుడికి
జీయర్ పురస్కారం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వేద పండితుడిగా సేవలందిస్తున్న గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు 36వ జీయర్ పురస్కారం అందుకున్నారు. ఆయనకు సోమవారం చిన్న జీయర్ స్వామి పురస్కారాన్ని ప్రదానం చేశారు. గతంలో ఆయన ఆమ్నాయ విద్వన్మణి, వేదజ్యోతి, వేదాచార్య, వేదకోవిద తదితర బిరుదులు పొందారు. పలు పీఠాల నుంచి సన్మానాలు అందుకున్నారు. ప్రస్తుతం రామాలయంలో స్వామివారి కై ంకర్యాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వేద సేవలందిస్తున్నారు.
12న లైసెన్సుల వేలం
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన తొమ్మిది లైసెన్సు హక్కులకు ఈనెల 12న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ దామోదరరావు తెలిపారు. తానీషా కల్యాణ మండపంలోని ఈఓ కార్యాలయంలో వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. దసరా మండపంలోని ఆరు షాపులు, కలగర తాయారు కాటేజీ ఖాళీ స్థలం, పర్ణశాలలో కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్, దీపారాధన ఒత్తుల విక్రయ హక్కులకు పాట నిర్వహిస్తామని, ధరావత్తు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుందని వివరించారు. దేవస్థానానికి బకాయి ఉన్నవారు, వివాదాల్లో ఉన్నవారు వేలంలో పాల్గొనేందుకు అనర్హులని, ఇతర వివరాలకు ఆలయ కార్యాలయంలో సంప్రదించాలని ఈఓ ఓ ప్రకటనలో కోరారు.


