సత్తుపల్లిటౌన్: తల్లిదండ్రులు ట్రాక్టర్ కొనివ్వలేదని మనస్తాపంతో ఓ యువకుడు బేతపల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈమేరకు సోమవారం మృతదేహాన్ని గుర్తించారు. దమ్మపేట మండలం సీతారామపురం గ్రామానికి చెందిన కడెం మనోజ్(20) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా సొంత ట్రాక్టర్ కొనివ్వాలని తండ్రి సురేష్‌ను కోరుతుండగా ఆర్థిక పరిస్థితి కారణంగా ఆయన దాటవేశాడు. దీంతో మనస్తాపానికి గురైన మనోజ్ ఈనెల 6న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో దమ్మపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. అయితే, ఆయన అదేరోజు బేతుపల్లి చెరువు కళంగి వద్ద దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. కాగా, ఈనెల 4వ తేదీ రాత్రి బేతుపల్లి చెరువులో గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ బోట్ల కోసం సిబ్బంది డ్రోన్ కెమెరాతో గాలింపు చేపట్టారు. ఈక్రమాన సోమవారం సాయంత్రం మృతదేహాన్ని గుర్తించారు. బయటకు తీశాక వివరాల కోసం సమీప ప్రాంతాల్లో ఆరా తీస్తుండగా మనోజ్ మృతదేహంగా ఆయన కుటుంబీకులు నిర్ధారించారు. అయితే, మృతదేహం ఉబ్బిపోవడంతో వైద్యులతో అక్కడే పోస్టుమార్టం చేయించామని సత్తుపల్లి సీఐ టి.శ్రీహరి తెలిపారు.
బోట్ల కోసం వెతుకుతుండగా
మృతదేహం గుర్తింపు


