ఆనందంగా ఉంది..
● మధిర నియోజకవర్గం నుంచి ఏడు జీపీలకు చోటు ● కేంద్రబృందం పరిశీలన తర్వాత అధికారిక ప్రకటన
బోనకల్: గ్రామాల సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన(పీఎం–అజయ్) కింద ఆదర్శ గ్రామాల ఎంపిక ప్రక్రియ ఊపందుకుంది. అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, అంతర్గత రహదారులు తదితర మౌలిక సదుపాయాల ప్రగతిని పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ గ్రామాలను ఎంపిక చేస్తుంది. ఈ మేరకు 2022–2023సంవత్సరానికి గాను జిల్లాలోని 20 గ్రామపంచాయతీలకు చోటు దక్కింది.
ముంద ంజలో ఉన్న గ్రామాలకు స్థానం
పీఎం–అజయ్ పథకం ద్వారా జిల్లాలో 20 గ్రామపంచాయతీలు ఆదర్శ గ్రామాలుగా ఎంపికయ్యాయి. ఇందులో మధిర నియోజకవర్గంలో ఏడింటికి స్థానం దక్కింది. బోనకల్ మండలంలోని చిరునోముల, చిన్నబీరవల్లి, కలకోట, మధిర మండలంలోని ఇల్లూరు, మునగాల(కృష్ణాపురం), చింతకాని మండలం చిన్నమండవ, ఎర్రుపాలెం మండలం చొప్పకట్లపాలెం ఉన్నాయి. అలాగే, కల్లూరు మండలం పెద్దకోరుకొండి, లింగాల(ఎర్రబోయినపల్లి), కొణిజర్ల మండలం గోపవరం, సత్తుపల్లి మండలం కిష్టారం, తల్లాడ మండలం కలకొడిమ, తిరుమలాయపాలెం మండలంలోని హస్నాబాద్, ఎర్రగడ్డ(కొక్కిరేణి), రఘునాథపాలెం ఉన్నాయి. అంతేకాక వేంసూరు మండలంలోని దుద్దిపుడి, కందుకూరు, వైరా మండలం గొల్లనపాడు, వల్లాపు రం, విప్పలమడక జీపీలు ఎంపికయ్యాయి. పారిశుద్ధ్య నిర్వహణ, హరితహారం, పాఠశాలలలో మరుగుదొడ్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణం వంటి పనులతో ఈ గ్రామాలు ఆదర్శవంతమైన అభివృద్ధిని సాధించాయి.
కేంద్రం నిధులతో సమగ్ర అభివృద్ధి
గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో ఉత్తమ పనితీరు ఆధారంగా ఎంపిక చేసినా వెల్లడి కాలేదు. తాజాగా కేంద్రప్రభుత్వం ఆయా గ్రామపంచాయతీల వివరాలను పునఃపరిశీలన నిమిత్తం మండలాల వారీగా జాబితా విడుదల చేసింది. త్వరలోనే కేంద్ర బృందం మరోసారి గ్రామాల్లో క్షేత్రస్థాయి సర్వే చేపట్టి ఇచ్చే నివేదిక ఆధారంగా అధికారికంగా ఉత్తమ ఆదర్శ గ్రామాలుగా ప్రకటిస్తారు. ఆపై మౌలిక వసలు కల్పన, జీవన ప్రమాణాల పెంపునకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించనుంది.
మా గ్రామానికి కేంద్రప్రభుత్వం గుర్తించిన ఉత్తమ పంచాయతీల జాబితాలో చోటుదక్కడం ఆనందంగా ఉంది. పునఃపరిశీలనలో కూడా కేంద్రబృందం సంతృప్తి వ్యక్తం చేస్తుందనే నమ్మకముంది. తద్వారా విడుదలయ్యే నిధులతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.
– అనుమోల చంద్రకళ, సర్పంచ్, చిరునోముల


