గ్రిడ్‌కు 3 మెగావాట్ల సౌర విద్యుత్
అనుసంధానం
మార్చి నాటికి మరో 76 మెగావాట్ల
విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
ఖమ్మంవ్యవసాయం/సత్తుల్లి రూరల్: సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్న నేపథ్యాన జిల్లాలో పీఎం–కుసుమ్ పథకం కింద ఇప్పటివరకు 92 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 55 సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు టీజీ రెడ్‌కోకు దరఖాస్తులు అందాయి. ఇందులో 11 ప్లాంట్లు పూర్తికాగా 16 మెగావాట్ల విద్యుత్ విజయవంతంగా ఉత్పత్తి అవుతూ గ్రిడ్‌కు అనుసంధానమైంది. సత్తుపల్లి డివిజన్‌లో సిద్ధమైన మూడు ప్లాంట్ల ద్వారా విద్యుత్‌ను అధికారులు శుక్రవారం గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. రేజర్ల, ఎర్రగుంట, సదాశివుపాలెంకు చెందిన రైతులు గొర్ల అనసూర్య, కాసర్ల శ్రీనివాసరావు, కాసర్ల రాంబాబు ఏర్పాటు చేసిన ఒక్కో మెగావాట్ ప్లాంట్లు ఇందులో ఉండగా, మూడు మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమాల్లో ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, టీజీ రెడ్‌కో జిల్లా మేనేజర్ పొలిశెట్టి అజయ్‌కుమార్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
డిసెంబర్ నాటికి 15 ప్లాంట్లు
దరఖాస్తుల ప్రాధాన్యత ఆధారంగా డిసెంబర్ నాటికి 15 ప్లాంట్లు పూర్తి చేసి 27 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, జనవరి నాటికి 10 ప్లాంట్లు పూర్తి చేసుకుని 20 మెగావాట్లు, మార్చి నాటికి 19 ప్లాంట్లు పూర్తి చేసుకొని 29 మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. పీఎం కుసుం పథకం ద్వారా రైతులు తమ వ్యవసాయ, బీడుభూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆదాయం గడిస్తున్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తితో రైతులకు లబ్ధి జరగడమే కాక పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరుల ప్రోత్సాహానికి దోహదపడుతుంది.


