వైద్యానికి పేదరికం అడ్డుకావొద్దు | - | Sakshi
Sakshi News home page

వైద్యానికి పేదరికం అడ్డుకావొద్దు

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

నిరుపేదలకు అత్యాధునిక వైద్యం

అభినందనీయం

‘సింధు’ హాస్పిటల్‌ వైద్యశిబిరం, ల్యాబ్‌ బస్‌ను ప్రారంభించిన మంత్రి తుమ్మల

వేంసూరు: ఆర్థిక స్థోమత కారణంగా ఏ ఒక్కరు నాణ్యమైన వైద్యానికి దూరం కావొద్దనే లక్ష్యంతో అత్యాధునిక వైద్యసేవలను గ్రామీణ ప్రాంత సామాన్యులకు చేరువ చేస్తున్న సింధు హాస్పిటల్‌ చైర్మన్‌, హెటిరో డ్రగ్‌ అధినేత, ఎంపీ బండి పార్థసారధిరెడ్డి సేవలు అభినందనీయమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వేంసూరు మండలం కందుకూరులో సింధు హాస్పిటల్‌ ఆధ్వర్యాన శుక్రవారం ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే మట్టా రాగమయి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా తుమ్మల మాట్లాడుతూ మారుమూల ప్రాంతం నుంచి ఉన్నత స్థాయికి చేరినా స్వగ్రామాన్ని మరువకుండా సేవలు చేస్తున్న పార్థసారధిరెడ్డి ఆదర్శ ప్రాయుడని కొనియాడారు. కరోనా సమయాన ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపారు. ఎమ్మెల్యే రాగమయి, ఎంపీ వద్దిరాజు, మాజీ ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అత్యంత ఖరీదైన కేన్సర్‌ వైద్యాన్ని సైతం సామాన్యులకు చేరువయ్యేలా కృషి చేస్తున్నారని కొనియాడారు.

రూ.2కోట్లతో ల్యాబ్‌ బస్‌

ఎంపీ పార్థసారధిరెడ్డి మాట్లాడుతూ సింధు హాస్పటల్స్‌లో నిరుపేదలకు ఉచిత వైద్యసేవలు అందేలా ప్రాధాన్యత ఇస్తున్నామని, వైద్యం కోసం వచ్చే పేదలకు వసతి కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రజలకు వైద్యసేవలు అందించడమే కాక ఇంటి ముంగిట్లోనే కేన్సర్‌ స్క్రీనింగ్‌ చేసేందుకు రూ.2 కోట్లతో అత్యాధునిక ప్రత్యేక ల్యాబ్‌ బస్‌ను సిద్ధం చేశామని తెలిపారు. ప్రతీరోజు ఒక్కో గ్రామానికి వచ్చే ఈ బస్సులో మామోగ్రపీ, కేన్సర్‌ పరీక్షలు చేస్తారని తెలిపారు. వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే మేలు జరుగుతుందని చెప్పారు. కాగా, కందుకూరులో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి పరిసర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో జనం హాజరుకాగా పరీక్షలు చేశారు. కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌, సింధు హాస్పిటల్‌ ఎండీ సోమరాజు, సర్పంచ్‌ మందపాటి వెంకటరెడ్డి, ఉప సర్పంచ్‌ గొర్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement