● నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం సమీపాన ఆధారాలు ● క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ దివాకర
నేలకొండపల్లి: నేలకొండపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రాచీన మానవ నివాసానికి సంబంధించిన ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయని కలెక్టర్ దివాకర టీ.ఎస్. వెల్లడించారు. దక్షిణ భారతదేశంలోనే ప్రాధాన్యత కలిగిన నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించగా బౌద్ధులు నడయాడిన ప్రాంత పరిధి, ఆనవాళ్లు గుర్తించేందుకు పురావస్తు శాఖ ఆధ్వర్యాన రెండు రోజులుగా తవ్వకాలు చేపడుతున్నారు. ఈక్రమాన దాదాపు 2వేల ఏళ్ల క్రితం ఇక్కడ మానవ ఆవాసం ఉన్నట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. పురాతన కాలం నాటి నూనె గానులు, ఆనాడు బౌద్ధులు వినియోగించిన వస్తువులను గుర్తించారు. ఈనేపథ్యాన కలెక్టర్ దివాకర శుక్రవారం తవ్వకాలు జరిపిన బైరాగిగుట్ట, మోర్లబండ వాగు తదితర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారసత్వ శాఖ పురావస్తు ఆన్వేషణ బృందం చేపట్టిన సర్వేలో ప్రాచీన, ఇటుక నిర్మాణాలు లభించగా, బైరాగి గుట్ట, మెర్లబండ వాగు పరిసరాల్లో ఇంకొన్ని ఆధారాలు లభించాయని తెలిపారు. నాటి ప్రజల దైనందిన జీవన విధానం, కళాత్మాక నైపుణ్యం, వస్తు సంస్కృతిని ప్రతిబింబించే మట్టి పూసలు, బండి చక్రం, రాతి రోకలి, ఎరుపు, నలుపు రంగు కలిగిన పాత్రలు, పెంకులు వంటి సామగ్రి బయటపడ్డాయని చెప్పారు. ఇక్కడ వెలుగు చూసిన మృణ్మయ పాత్రల పెంకులపై పుష్పాలంకరణ, బొటనవేలి ముద్రలు, తాడు ఆకారపు ఆలంకరణలు, పౌరాణిక ఆకృతులు, ముద్రిత అలంకరణలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో అధ్యయనానికి ఇవి కీలకంగా నిలుస్తాయని, ఇదే సమయాన మరింత శాసీ్త్రయ పరిశోధన చేపట్టాల్సి ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి.నాగరాజు, ఏడీలు మల్లునాయక్, బి.గంగాదేవి, అశ్విన్‌కుమార్, జిల్లా టూరిజం అధికారి సుమన్‌చక్రవర్తితో పాటు తహసీల్దార్ పి.రాంప్రసాద్, ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంపీఓ ఎం.శ్రీనివాసరావు, ఎనిర్వాల్‌మెంట్ సంస్థ చైర్మన్ దుడ్డెల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
గడువులోగా అభివృద్ధి, సంక్షేమ పనులు
●ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వం నిర్దేశిత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. వేసవి ముగిసే వరకు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా కలెక్టర్, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. తాగునీటి సరఫరా, పీఎంశ్రీ పాఠశాలలు, సమగ్ర శిక్షా అభియాన్ నిధుల వినియోగం, ఇందిరమ్మ ఇళ్లు, వీబీజీ రామ్‌జీ పథకంపై సీఎస్ సమీక్షించి సూచనలు చేశారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చోట్ల ప్రైవేట్ బోర్లు గుర్తించడమే కాక ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని తెలిపారు. పాడైన చేతిపంపులు, బోర్ల మరమ్మతులను 15లోగా పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం పాఠశాలల్లో అభివృద్ధి పనులు, ఉపాధి పనులు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుపై సమీక్షించారు. కాగా, ఖమ్మం–దేవరపల్లి హైవే భూసేకరణకు సంబంధించి మిగిలిన రూ.3 కోట్ల విలువైన అవార్డులకు టోకెన్లు జారీ కాగా, చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. డీఆర్‌డీఓ కె. శ్రీరామ్, డీపీఓ వినోద్‌కుమార్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యుగంధర్‌రావు, మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
●ఖమ్మం స్పోర్ట్స్: మై భారత్ ఆధ్వర్యాన ఈనెల 10న నిర్వహించే జిల్లాస్థాయి ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ పోస్టర్లను కలెక్టర్ దివాకర ఆవిష్కరించారు. ఈనెల 10న కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలలో జరిగే కార్యక్రమంలో ‘నషా ముక్త్ భారత్‘ అంశంపై తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉపన్యాస పోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. డీఆర్‌ఓ సీహెచ్.రామ్మూర్తి, మై భారత్ అధికారి ఎం.వెంకటరాంబాబు పాల్గొన్నారు.


