‘బేతుపల్లి’ తగ్గుముఖం | - | Sakshi
Sakshi News home page

‘బేతుపల్లి’ తగ్గుముఖం

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

● తమ్మిలేరు వాగులోకి కొనసాగుతున్న ప్రవాహం ● మూడు రోజుల క్రితం గరిష్టస్థాయిలో 48వేల క్యూసెక్కుల వరద

● తమ్మిలేరు వాగులోకి కొనసాగుతున్న ప్రవాహం ● మూడు రోజుల క్రితం గరిష్టస్థాయిలో 48వేల క్యూసెక్కుల వరద

సత్తుపల్లి: సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువులో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. మూడు రోజుల క్రితం చెరువులో వరద పోటెత్తగా మత్స్యకారులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నా సురక్షితంగానే బయటపడ్డారు. ఈ నేపథ్యాన చెరువులో వరద పరిస్థితిపై అధికారులు శుక్రవారం ఆరా తీశారు. ఈ చెరువు సామర్థ్యం 38.200 క్యూసెక్కులుగా ఉంది. అయితే, మురసు తుపాన్‌ ప్రభావంతో ఎగువ చెరువులకు గండ్లు పడడంతో బుధ, గురువారం వరద పోటెత్తింది. ఈక్రమాన బుధవారం ఉదయమే బేతుపల్లి ప్రత్యామ్నాయ కాల్వ ద్వారా వేంసూరు మండలానికి 400క్యూసెక్కుల నీటిని ఎమ్మెల్యే రాగమయి విడుదల చేశారు. ఆ సమయంలో బేతుపల్లి చెరువు నీటిమట్టం 16అడుగులకు గాను 15.6 అడుగులుగా ఉంది.

సమన్వయ లోపం

తుపాన్‌ ప్రభావంతో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ముందుగానే హెచ్చరించింది. అయినా రెండు జిల్లాల సరిహద్దు మండలాల అధికారులు సమన్వయంతో వ్యవహరించలేదని తెలుస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా దమ్మపేట, సత్తుపల్లి మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ములకలపల్లి, దమ్మపేట మండలాల్లోని అటవీప్రాంతంలో కురిసిన వర్షాలతో మొదలైన వరద బొల్లిగట్టు చెరువు మీదుగా ఆర్లపెంట చింతలచెరువు, అంకంపాలెం దేవుడు చెరువు, మల్లెపూల వాగు, లింగాలపల్లి చెరువు, శ్రీరాంపురం చెరువులకు వరద పోటెత్తింది. దీంతో బుధవారం 6–30 గంటలకు గండ్లు పడి వరద తీవ్ర రూపం దాల్చింది. ఈ సమాచారాన్ని దమ్మపేట అధికారులు.. సత్తుపల్లి అధికారులకు సకాలంలో ఇవ్వకపోవడంతో స్థానికులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ఫలితంగా ఎనిమిది మత్స్యకారులు వెళ్లి వరదలో చిక్కుకోవడం, వారిని రక్షించేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అధికారులు ప్రమాదంలో పడిన విషయం విదితమే. అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చేలా అధికారులు నిద్రాహారాలు మారి 14గంటల పాటు కష్టపడాల్సి వచ్చింది. అంతేకాక ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గల్లంతుపై సామాజిక మాధ్యమాల్లో జరిగిన అసత్య ప్రచారంతో వారి కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రెండు జిల్లాల్లోని సరిహద్దుల మండలాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచనలు వస్తున్నాయి.

2023 ఏడాదిలో 38వేల క్యూసెక్కులు

మూడేళ్ల క్రితం బేతుపల్లి చెరువుకు గరిష్టంగా 38వేల క్యూసెక్కుల వరద వచ్చింది. తుపాన్‌తో అలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశముందని తెలిసినా అధికార యంత్రాంగం ఆ దిశగా జాగ్రత్తలు తీసుకోలేదని తెలుస్తోంది. బుధవారం ఉదయం కేవలం 1,500 నుంచి 3వేల క్యూసెక్కుల వరద మాత్రమే నమోదైంది. అయితే, మధ్యాహ్నం 12–30గంటలకు 4వేల క్యూసెక్కులు ఉండగా, ఆ తర్వాత గంటగంటకు వరద రెట్టింపు వేగంతో పెరుగుతూ ప్రమాదకర స్థితికి చేరింది. సాయంత్రం 6గంటలకల్లా 34 వేల క్యూసెక్కులు, రాత్రి 8గంటలకు 48 వేల క్యూసెక్కులకు ఉదృత రూపం దాల్చింది. ఇక గురువారం సాయంత్రం 4–30 గంటల నుంచి తగ్గుతూ శుక్రవారం మధ్యాహ్నం కేవలం వేయి క్యూసెక్కుల వరద అలుగు ద్వారా తమ్మిలేరు వాగులోకి చేరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement