ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, మత్స్యకారులు సురక్షితంగా బయటకు
12గంటలకు పైగా కొనసాగిన
రెస్క్యూ ఆపరేషన్
బోట్లు బోల్తా ఎలా పడ్డాయంటే...
క్షణక్షణం ఉత్కంఠ.. గంటల తరబడి నిరీక్షణ.. అధికారుల సూచనలు.. కుటుంబీకుల్లో
ఆందోళన.. సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువు వద్ద బుధవారం రాత్రి 7గంటల నుంచి
గురువారం ఉదయం 7–30గంటల వరకు నెలకొన్న పరిస్థితి ఇది. బేతుపల్లి చెరువు
వరదలో చిక్కుకున్న మత్స్యకారులను
రక్షించేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోట్లు బోల్తా పడడంతో అందరూ గల్లంతు కాగా ఆందోళన నెలకొంది. ఈక్రమాన
ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం రంగంలోకి దిగడం, ఖమ్మం కలెక్టర్ దివాకర, భద్రాద్రి ఎస్పీ
రోహిత్‌రాజ్ పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అందరూ సురక్షితంగా బయటకు రావడంతో ఉత్కంఠకు తెరపడింది. గంటల తరబడి సహాయక చర్యలను పర్యవేక్షించిన
అధికారులపై ప్రశంసలు వెల్లువెత్తగా.. వరద నుంచి బయటపడిన సిబ్బంది కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. – సత్తుపల్లి
బేతుపల్లి చెరువు వరదలో ఎనిమిది మంది మత్స్యకారులు బొంతల రమేష్, పొదిలి శ్రీనివాసరావు, రామయ్య, పొదిలి అర్జున్‌రావు, కుంచపు మారేశ్వరరావు, వల్లెపు మనోజ్, ఇనుముల అనిల్, నీలాల గిరి చిక్కుకున్నారనే సమాచారం అందిన వెంటనే కలెక్టర్ దివాకర చెరువు వద్దకు చేరుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండ బెటాలియన్ నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రాగానే సహాయక చర్యలు ప్రారంభించారు. రెవెన్యూ, ఫైర్, పోలీస్ అధికారులను కలెక్టర్ సమన్వయపరుస్తుండగా తొలుత బోట్‌లో వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ముగ్గురు మత్స్యకారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత మరో రెండు బోట్లలో పది మంది సిబ్బంది, ఒక మత్స్యకారుడు గైడ్‌గా వెళ్లాడు. అయితే, ఆ రెండు బోట్లు వరద ఉధృతితో బోల్తా పడి అంతా గల్లంతవడంతో భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు.
రెండు బోట్లు బోల్తాపడగా ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందంలోని ఎస్సై, సిబ్బంది మురళి, నరేష్, వేణు, సీత య్య, కాశీరామ్, బాలాజీ, నల్లమోతు రాజ, నజీర్ యాసిన్, వెంకట్రామిరెడ్డి, నజర్ వలీ గల్లంతయ్యా రు. అయితే, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సుశిక్షితులు కావడంతో.. ఏమీ జరగదని భావిస్తూనే విజయవాడ నుంచి వచ్చిన ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని రెండు బోట్ల లో పంపించారు. ఇక్కడ తొలి ప్రాధాన్యత ఐదుగురు మత్స్యకారులను రక్షించడానికే ఇచ్చారు. దీంతో బుధవారం రాత్రి 11–15 గంటలకు మత్స్యకారులను ఒడ్డుకు చేర్చడంతో ఒక అంకం ముగిసింది.
పది మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, దారి చూపించడానికి వెళ్లిన మత్స్యకారుడు బెజవాడ ధర్మరాజును రక్షించేందుకు ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి ఫోన్ ట్రాకింగ్ చేస్తూ రక్షించేందుకు ఉన్న మార్గాలపై కలెక్టర్ చర్చించారు. కాకర్లపల్లి శివాలయం మీదుగా లాక్‌ల వద్దకు వెళ్లి బేతుపల్లి ప్రత్యామ్నాయ మార్గంలో ఉన్న ఫోన్ సిగ్నళ్లు గుర్తించడంతో వారి ఆచూకీ తెలిసింది. దీంతో గురువారం తెల్లవారుజామున 4–30 గంటల నుంచే ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేసి వారిని రక్షించేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఉదయం 7–15గంటలకు వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం.. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా రెస్క్యూ ఆపరేషన్ ముగియడంతో అప్పటికే అక్కడకు చేరుకున్న మంత్రులు పొంగులేటి, తుమ్మల తదితరులు కలెక్టర్ దివాకరను అభినందించారు.
ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా, రాత్రంతా పర్యవేక్షిసూ మత్స్యకారులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా రక్షించడంపై సీఎం రేవంత్‌రెడ్డి అధి కారులను అభినందించారు. ఈ మేరకు దివాకర టీ.ఎస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ సీఎం ట్వీట్ చేశారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. అంతేకాక సీఎస్ సంజయ్ జాజు సై తం కలెక్టర్ దివాకర, భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజ్‌తో పాటు ఉద్యోగులను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
బేతుపల్లి వరదలో గల్లంతైన
అందరూ క్షేమం
ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందికి చెందిన రెండు బోట్లు బోల్తాపడటానికి ‘యాంకరింగ్ తాడు’ కారణమైంది. అందులో ఉన్న కానిస్టేబుల్ బానోతు బాలాజీ వెల్లడించిన వివరాల ప్రకారం.... మత్స్యకారులు ఉన్న సమీపానికి చేరుకోగానే వారి వైపునకు యాంకరింగ్ తాడు బోటు నుంచి విసిరారు. అదికాస్త బోటు మోటారులో ఇరుక్కుపోవడంతో మొదట ఒకటి, దాన్ని తాకిన రెండో బోటు సైతం బోల్తా కొట్టడంతో 11 మంది నీళ్లల్లో పడిపోయారు. మత్స్యకారుడు ధర్మరాజు లైఫ్ జాకెట్ లేకున్నా ఆందోళన వ్యక్తమైనా సిబ్బందితో ఉండడంతో ఏమీ జరగలేదు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సుశిక్షితులు కావడం, మానసికంగా, శారీరకంగా బలంగా ఉండడంతో రాత్రంతా చిమ్మచీకటి, చుట్టూ వరద పారుతుతున్నా చెట్లను ఆసరాగా చేసుకుని కాలం గడిపారు. తరచూ టార్చ్ లైట్లు వేస్తుండగా.. ఒడ్డు నుంచి అధికారులు వేసిన లైట్లు కనిపించడంతో ఆనవాళ్లు బయటపడ్డాయి.


