పంట ‘మురస’ర్పణం | - | Sakshi
Sakshi News home page

పంట ‘మురస’ర్పణం

Nov 6 2026 1:32 AM | Updated on Nov 6 2026 1:32 AM

రైతును నిండా ముంచిన వానలు

చేతికొచ్చిన పంటలన్నీ నీళ్ల పాలు

జిల్లాలో 23వేలకు పైగా

ఎకరాల్లో నష్టం

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో రైతుల ఆశలపై ‘మురసు’ తుపాన్‌ నీళ్లు చల్లింది. ఎల్‌నినోతో ఏర్పడిన అనావృష్టిని తట్టుకుని పండించిన పంట అతివృష్టితో నేలపాలైంది. వర్షాభావంతో దిగుబడి తక్కువగా వచ్చినా.. పండిన పంటకు డిమాండ్‌ ఉండటంతో రైతులు పెట్టుబడులైనా దక్కుతాయనే ఆశతో ఉన్నారు. కానీ తుపాన్‌తో వచ్చిన వర్షం, ఈదురుగాలులతో వరి, పత్తి పంటలు దెబ్బతినగా.. మిర్చి పంట కూడా నీటమునిగింది. జిల్లాలో వరి, పత్తి, మిర్చితో పాటు కూరగాయలు కలిపి 23,140వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. అధికారులు సర్వే చేస్తే నష్టం మరింత పెరిగే అవకాశముంది.

అదునులో జాడ లేని ‘వాన’

ఎల్‌నినోతో ఈ ఏడాది వర్షాకాలంలో రైతులపై కన్నెర్ర చేసింది. గడిచిన కొన్నేళ్లలో అనావృష్టి ఎదురైనా, కనీసం నైరుతి రుతుపవనాలతో వర్షాలు కురిసేవి. ఈసారి 26శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో పంటలు సాగు చేయడం తలకు మించిన భారంగా మారింది. జిల్లాలో అన్నిపంటలు కలిపి 5,53,329 ఎకరాల్లో సాగు చేయగా, అందులో వరి 2,92,915 ఎకరాల్లో, పత్తి 2,16,229 ఎకరాల్లో ఉన్నాయి. జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు ముఖం చాటేయడంతో పంటలన్నీ వడపడినా, సెప్టెంబర్‌లో రెండు, మూడు రోజులు కురిసిన వర్షాలు కొంత ఆదుకున్నాయి.

డిమాండ్‌ ఉందని..

అరకొర వర్షాలు, కొద్దోగొప్పో ఉన్న నీటి వనరులతో రైతులు పంటలు సాగు చేసినా వరి, పత్తి అనుకున్న మేరకు దిగుబడులు రాలేదు. జిల్లాలో వరి కోతలు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభం కాగా.. మరికొన్ని చోట్ల చివరి దశలో ఉంది. పత్తి ఒకటో తీత పూర్తయి, రెండు, మూడో తీతల దశలో ఉంది. ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యం క్వింటాకు రూ.2,441, పత్తికి రూ.8,667 మద్దతు ధర ప్రకటిస్తే, ధాన్యానికి రూ.3 వేల నుంచి రూ.4వేలు, పత్తికి గరిష్టంగా రూ.9,600 ధర వస్తుండడంతో రైతులు ఆనందించారు.

మోదం.. ఖేదం

తుపాన్‌తో కురిసిన వర్షాలు పంటలకు నష్టం చేసినా, భూగర్భ జలాలు పెరుగుతాయనే ఆశలు పెంచాయి. మరోవైపు చివరి తడులు అవసరమైన పంటలకు ఈ తుపాన్‌ ఊపిరి పోసింది. ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరగా చెరువులు నిండాయి. ఇదే సమయాన కోతకు సిద్ధంగా ఉన్న వరి, పత్తి పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. మురసు తుపాన్‌తో జిల్లాలో ముసురు పట్టి రెండు రోజుల పాటు కురిసిన వర్షాలతో నష్టం ఎదురైంది. జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలో భారీ వర్షంతో రైతులపై కోలుకోలేని దెబ్బ పడింది. కాగా, వర్షంతోపాటు గాలులతో వరి పంట నేలవాలడం, కోతకు వచ్చిన పంట నీట మునగడంతో ధాన్యం రంగు మారడమే కాక మొలకలు వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే, పత్తి కాయలు తడిసి తేమ పెరగడంతో నాణ్యత కోల్పోయింది. ఇక మిరప చేన్లలో నీరు నిలిచి వేరు కుళ్లిపోయి పంట దెబ్బతింటుందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement