● 25సీట్లకు ఎన్‌ఎంసీ అనుమతి ● ఈ ఏడాది నుంచే తరగతులు
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ సీట్లకు అనుమతి లభించింది. ఈమేరకు ఐదు విభాగాల్లో 25సీట్ల భర్తీకి ఎన్‌ఎంసీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న పీజీ కల నిరవేరినట్లయింది. పీజీ కోర్సులకు అనుమతి కోసం అధికారులు పంపించిన ప్రతిపాదనల ఆధారంగా నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) బృందం బోధన ఆస్పత్రి, మెడికల్ కాలేజీలో తనిఖీలు చేపట్టింది. ఆస్పత్రిలో వసతులు, సౌకర్యాలు, బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్య వివరాలతో నివేదిక సమర్పించగా, అంతా సవ్యంగా ఉండడంతో అనుమతులు మంజూరయ్యాయి.
ఐదు విభాగాల్లో..
ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2023 ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు మొదలయ్యాయి. ప్రస్తుతం నాలుగో బ్యాచ్ ప్రవేశాలు ముగియగా 400 మంది విద్యార్థులతో కళాశాల కళకళ లాడుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఐదు విభాగాలకు గాను 25 పీజీ సీట్ల కోసం ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్, పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు డీఎంఈకి ప్రతిపాదనలు పంపారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్తీషియా, ఆర్ధోపెడిక్, గైనకాలజీ విభాగాల్లో ఐదేసీ సీట్ల కోసం ప్రతిపాదించగా, డీఎంఈ నుంచి ఎన్‌ఎంసీకి పంపించారు.
సెప్టెంబర్‌లో తనిఖీలు
పీజీ సీట్లకు అనుమతి కోసం ఎన్‌ఎంసీ బృందం విడతల వారీగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, బోధన ఆస్పత్రిలో తనిఖీ చేసింది. ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు సౌకర్యాలు, ఏర్పాట్లపై ఆరా తీసి నివేదికలు సమర్పించారు. ఈ నివేదికలపై నేషనల్ మెడికల్ కమిషన్ సంతృప్తి చెందడంతో 25 సీట్లకు అనుమతులు మంజూరు చేసింది. ఈ విషయంపై ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ పీజీ సీట్లకు అనుమతి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. అయితే, ఎన్‌ఎంసీ నుంచి లేఖ అందాల్సి ఉందని, పీజీ సీట్లు ఈ విద్యా సంవత్సరమే భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. పీజీ విద్యార్థులు వస్తే ఆస్పత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని తెలిపారు.


