క్షణక్షణం ఉత్కంఠ ! | - | Sakshi
Sakshi News home page

క్షణక్షణం ఉత్కంఠ !

Nov 6 2026 1:32 AM | Updated on Nov 6 2026 1:32 AM

● ఉదయం 7–30 గంటలకు ముగిసిన ‘రెస్క్యూ ఆపరేషన్‌’

12గంటల పాటు చెరువు వద్ద నిరీక్షణ
● ఉదయం 7–30 గంటలకు ముగిసిన ‘రెస్క్యూ ఆపరేషన్‌’

సత్తుపల్లి: చిమ్మచీకటి.. ఎటు చూసినా వరద.. చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్లు చిక్కుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిలో కొందరు చెట్ల కొమ్మలు పట్టుకొని.. ఇంకొందరు ముళ్ల కంచెలపై కూర్చొని కాలం గడిపారు. అయినా గుండె ధైర్యం కూడగట్టుకుంటూ పట్టు సడలకుండా నిలిచిన వారు చివరకు సురక్షితంగా బయటపడ్డారు. అయితే, అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నీటిలోనే ఉన్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ధైర్యసహసాలను అంతా మెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌ వివరాలు...

●బుధవారం సాయంత్రం 5–30 గంటలు : బేతుపల్లి వరదలో మత్స్యకారులు చిక్కుకున్నారనే సమాచారం కాకర్లపల్లి సర్పంచ్‌ పొదిలి మారేశ్వరరావుకు :డఏచేరింది. ఆయన స్థానికులతో కలిసి వెళ్లారు.

●6–05 గంటలు : సర్పంచ్‌ సమాచారంతో తహసీల్దార్‌ పర్సా రవి, సీఐ తుమ్మలపల్లి శ్రీహరి, ఆతర్వాత 35నిమిషాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వచ్చారు.వెంటనే అక్కడికి చేరుకున్నారు.

●రాత్రి 7–20 గంటలు : ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బోట్లలో వెళ్లి వరదలో చిక్కుకున్న ముగ్గురు మత్స్యకారులను ఒడ్డుకు చేర్చారు.

●7–31 గంటలు : మిగతా ఐదుగురిని రక్షించేందుకు గాను ఒక బోటులో ఆరుగురు, మరో బోటులో ఐదుగురు వెళ్లగా వీరిలో పది మంది సిబ్బంది, ఒక మత్స్యకారుడు ఉన్నారు.

●7–45 గంటలు : కలెక్టర్‌ దివాకర, అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, సబ్‌ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌, ఎమ్మెల్యే రాగమయి చేరుకుని సహాయక చర్యల్లో భాగమయయ్యారు.

●7:54 గంటలు : మత్స్యకారులను తీసుకుని సిబ్బంది వస్తారని చూస్తుండగా వారు వెళ్లిన రెండు బోట్లు బోల్తా పడ్డాయనే సమాచారం అందింది. అప్పటికే వరదలో చిక్కుకున్న మత్స్యకారులు ఫోన్‌లో ఇచ్చిన సమాచారంతో టెన్షన్‌ మొదలైంది.

●8–05 గంటలు : కలెక్టర్‌ దివాకర సూచనలతో ఫైర్‌ సిబ్బంది తమ్మిలేరు వాగు వచ్చే సత్తుపల్లి పెద్ద వంతెన వద్దకు చేరుకొని బ్రిడ్జి స్తంభాలకు తాళ్లను కట్టి నీళ్లలోకి వదిలారు. పెద్ద పెద్ద లైట్లతో గాలింపు మొదలుపెట్టారు. ఆ కాసేపటికే భద్రాద్రి ఎస్పీ రోహిత్‌ రాజ్‌ చేరుకుని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

●10–25 నుంచి 11–13గంటలు : ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది చేరకుని బోట్ల ద్వారా గాలింపు చేపడుతూనే, అప్పటికే వరదలో చిక్కుకున్న ఐదుగురు మత్స్యకారులను ఒడ్డుకు చేర్చారు.

●11– 30 గంటలు : ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రక్షించేందుకు కలెక్టర్‌ దివాకర, ఎస్పీ రోహిత్‌ రాజ్‌ సిబ్బందితో కలిసి ఫోన్‌ ట్రాకింగ్‌ ద్వారా ఆరా తీస్తుండగానే నలుగురు తమ్మిలేరు వాగు మధ్యలో చిక్కుకున్నట్లు తేలింది. దీంతో సిబ్బంది మత్స్యకారులు కాకర్లపల్లి వైపు నుంచి బేతుపల్లి లాకుల వైపు ట్రాక్టర్లపై చేరుకున్నారు.

●అర్ధరాత్రి 1–30 గంట : నలుగురు ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని గుర్తించగా, ఎస్సై వీరప్రసాద్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో వారు ఉన్న చోటకు చేరుకున్నారు. సుమారు గంటన్నర రెస్క్యూ అనంతరం 2–45గంటలకు వారిని బయటకు తీసుకొచ్చారు.

●గురువారం ఉదయం 5–13 గంటలు : చీకటి, వరదలో చెట్టు కొమ్మల ఊతంగా కాలం గడిపిన మరో ఐదుగురు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని, మత్స్యకారుడు బొమ్మకంటి ధర్మరాజును ఒడ్డుకు చేర్చారు.

●7–30 గంటలు : మరో ఉద్యోగి మిగిలిపోగా అధికారులు తీవ్రంగా శ్రమించి ఓ చెట్టు ఆధారంగా ఉన్న ఆయను గుర్తించి తీసుకురావడంతో ఆపరేషన్‌ ముగిసింది.

ప్రాథమిక చికిత్స

బేతుపల్లి చెరువు వరద నుంచి రక్షించిన మత్స్యకారులు, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని ఎప్పటికప్పుడు అంబులెన్స్‌ల్లో సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సూపరింటెండెంట్‌ సురేష్‌ నారాయణ, వైద్యులు చికిత్స చేయగా డీసీహెచ్‌ఓ రాజశేఖర్‌ గౌడ్‌ పర్యవేక్షించారు. అందరి ఆరోగ్య పరిస్థితి బాగుండడంతో ఇళ్లకు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement