ఖమ్మంమయూరిసెంటర్: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియ రద్దు, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ‘ఇండియా’ కూటమి పార్టీ ఆధ్వర్యాన ఆదివారం ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పాల్గొన్నారు. వీరి వెంట టీజీఐటీసీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు తదితరులు ఉన్నారు.
ఆర్చరీ టోర్నీకి తెలంగాణ ప్రతినిధిగా శంకరయ్య
ఖమ్మం స్పోర్ట్స్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా ఖమ్మంలో ఆర్చరీ పోటీలు జరగనున్నాయి. డిసెంబర్‌లో జరిగే ఈ టోర్నీ పర్యవేక్షణ కోసం తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ప్రతినిధిగా జాతీయ ఆర్చరీ అభివృద్ధి కమిటీ సభ్యుడు పుట్టా శంకరయ్యను నియమించారు. ఈమేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు టి.రాజు, పి.అరవింద్‌కుమార్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి సమాచారం ఇచ్చారు. కాగా, శంకరయ్య ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా, ఒలింపిక్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.
పీఆర్‌సీపై
కాలయాపన తగదు
● టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
నాగేశ్వరరావు
మధిర/ఖమ్మం సహకారనగర్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్‌సీ అమలులో రాష్ట్రప్రభుత్వం జాప్యాన్ని విడనాడాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మధిర, ఖమ్మంలో ఆదివారం జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ పీఆర్‌సీ 40 నెలలు ఆలస్యం కావడం మునుపెన్నడూ జరగలేదన్నారు. ఉద్యోగు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అసంతృప్తితో ఉన్నందున పీఆర్‌సీ ప్రకటించడంతో పాటు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు దారితీసే విధానాలను విడనాడి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించి బోధనకే పరిమితం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్‌వలీ, నాయకులు నర్సయ్య, సురేష్, ఉద్దండ్, పద్మ, అరవింద్, కేశ్యా, జ్యోతి, గురవయ్య, రవిబాబు, రాంబాబు, శంకర్‌రావు, బండారు నాగరాజు, అనుమోలు కోటేశ్వరరావు, జి.రామకృష్ణ, ఊట్ల కొండలరావు, షేక్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
‘దీన్ దయాళ్ స్పర్శ’ పరీక్ష
ఖమ్మంగాంధీచౌక్: విద్యార్థులకు స్టాంపుల సేకరణపై ఆసక్తి పెంచేందుకు తపాలా శాఖ ప్రవేశపెట్టిన ‘దీన్ దయాళ్ స్పర్శ యోజన’లో భాగంగా ఆదివారం పరీక్ష నిర్వహించారు. ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్ష జరగగా 108 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాన్ని ఖమ్మం డివిజన్ తపాలా శాఖ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి పరిశీలించి మాట్లాడారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థుల కోసం తపాలా శాఖ ఈ పథకాన్ని అమలుచేస్తోందని తెలిపారు. స్టాంపుల సేకరణను అలవాటుగా మార్చడంతో పాటు పరిశోధన దృక్ఫథాన్ని పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఏటా రూ. 6 వేల చొప్పున ఉపకార వేతనం అందుతుందని ఆయన తెలిపారు.


