ప్రస్తుతానికి ఎక్కడా సమస్య లేదు..
● నీటి సరఫరాల పథకాల పరిస్థితిపై ఆరా ● ఈనెలలో సర్వే, డిసెంబర్ నాటికి మరమ్మతుల పూర్తి ● నేడు సమీక్షించనున్న కలెక్టర్
ఖమ్మంఅర్బన్: ఎల్‌నినో ప్రభావం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో జలాశయాల్లోకి అంతంత మాత్రంగానే నీరు చేరింది. మరోపక్క భూగర్భ జలాలు అడుగంటే అవకాశముంది. ఈ నేపథ్యాన రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జిల్లా గ్రామీణ నీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్) శాఖ ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ఏటా వేసవికి నెల ముందు తాగునీటి పథకాలను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టేవారు. కానీ ఈసారి పరిస్థితుల కారణంగా ముందుగానే నీటి వనరుల పరిస్థితిని అంచనా వేసి, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించేందుకు ఈనెల 15నుంచి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక సర్వేకు సిద్ధమవుతున్నారు. ఈమేరకు పథకాల పనితీరు, ముందస్తు చర్యలపై కలెక్టర్ అధ్యక్షతన సోమవారం సమీక్ష జరగనుంది.
సమస్య వస్తే ఎలా ?
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఎండ తీవ్రత పెరిగి నీటి వనరులు అడుగంటుతాయనే అంచనా లతో అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యా రు. జిల్లాలోని 20 మండలాల పరిధి 915 హ్యాబిటేషన్లకు గాను 911 హ్యాబిటేషన్లకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా అవుతోంది. జిల్లా వ్యాప్తంగా 8,289 చేతిపంపులు, 1,298 స్థానిక నీటి సరఫరా పథకాలు, 294 సింగిల్‌ఫేజ్ మోటార్లు, 257 బహిరంగ బావుల ద్వారా ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి లేదని చెబుతున్నా... రానున్న రోజుల్లో ఇబ్బంది వస్తే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ముందస్తు కసరత్తు చేస్తున్నారు.
ప్రత్యేక బృందాల ఆధ్వర్యాన సర్వే
జిల్లాలోని అన్ని ఆవాసాల్లో తాగునీటి పథకాల స్థితి గతులు, నీటి లభ్యతపై ఆరా తీసేందుకు ఈనెల 15నుంచి ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి. చేతిపంపులు, బోర్లు, పంప్‌సెట్లు, తాగునీటి పథకాల పనితీరును పరిశీలించడంతో పాటు అవసరమైన మరమ్మతులు, పైపులైన్ల లీకేజీలను గురిస్తారు. అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఆర్‌డబ్ల్యూఎస్, గ్రిడ్ ఏఈలు, సర్పంచ్‌లతో సమన్వయ సమావేశాలు నిర్వహించి కార్యాచరణ రూపొందించనున్నారు. ప్రత్యేక సర్వే ద్వారా గుర్తించిన సమస్యలను డిసెంబర్ నాటికి మరమ్మతు చేసి వేసవికి సిద్ధం కానున్నారు. ఇదే సమయాన గ్రిడ్ నుంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినా, స్థానిక నీటివనరులు అడుగంటినా ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రత్యామ్నాయ వనరులను సైతం గురిస్తారు. అవసరమైన ప్రాంతాల్లో అద్దె బోర్లు, ఇతర నీటి వనరుల వినియోగంతోపాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందిస్తారు.
ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి లేదు. అయితే, రానున్న రోజుల్లో ఎల్‌నినోతో ఎద్దడి ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో గుర్తిచేందుకు గ్రామాల్లో సర్వే చేయనున్నాం. ఆపై నివేదిక రూపొందించిన ఉన్నతాధికారుల సూచనలతో కార్యాచరణ సిద్ధం చేస్తాం.
– శేఖర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ


