నిబంధనలు బేఖాతర్‌ | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు బేఖాతర్‌

Nov 2 2026 12:29 AM | Updated on Nov 2 2026 12:29 AM

● అక్రమంగా వెలుస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలు ● భద్రాచలంలో యథేచ్ఛగా ఏజెన్సీ చట్టాల ఉల్లంఘన ● యజమానులకు నోటీసులు జారీ చేసిన అధికారులు

● అక్రమంగా వెలుస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలు ● భద్రాచలంలో యథేచ్ఛగా ఏజెన్సీ చట్టాల ఉల్లంఘన ● యజమానులకు నోటీసులు జారీ చేసిన అధికారులు

భద్రాచలంఅర్బన్‌: ఏజెన్సీ చట్టాలు అమల్లో ఉన్న భద్రాచలం పట్టణంలో బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుండటంతోపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం శాంతినగర్‌, మెడికల్‌ కాలనీ, చప్టా దిగువ, కొత్తపేట తదితర ప్రాంతాల్లో జీ+2 భవనాలు సుమారు 40, జీ+4 భవనాలు మరో 11 వరకు ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తికాగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. నిబంధనల ఉల్లంఘనలపై భవనాల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. భద్రాచలం షెడ్యూల్డ్‌ ఏజెన్సీ ప్రాంతం కావడంతో భూముల బదలాయింపుపై ఆంక్షలు అమల్లో ఉన్నాయి. 1/70 చట్టం అమలులో ఉన్నా విచ్చలవిడిగా భవనాలు నిర్మిస్తుండటంతో అధికారుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

భక్తుల అవసరమే ఆసరా

భద్రాచలంలో ఏటా జరిగే శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి తదితర ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఆ సమయంలో వసతి గదులకు డిమాండ్‌ ఉంటుంది. దీంతో కొందరు భారీ భవనాలు నిర్మించి గదులను అధిక అద్దెలకు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. సాధారణ రోజుల్లో ఒక ధర, ఉత్సవాల సమయంలో మరో ధర వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తప్పనిసరి పరిస్థితుల్లో అధిక మొత్తం చెల్లించి గదులు తీసుకోవాల్సి వస్తోంది. అయితే భవనాలకు వాణిజ్య అనుమతులు ఉన్నాయా? నివాస అవసరాల కోసం నిర్మించి లాడ్జీలుగా వినియోగిస్తున్నారా? అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? అనే అంశాలను అధికారులు విచారించాల్సి ఉంది. మరోవైపు ఏజెన్సీ భూములు, నిర్మాణ అనుమతులపై హైకోర్టులో 15 వరకు కేసులు ఉన్నట్లు సమాచారం.

గతంలో కూలిన నాలుగు అంతస్తుల భవనం

గతంలో భద్రాచలంలో నిర్మిస్తున్న నాలుగు అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. నాసిరకంగా నిర్మించడంతో భవనం కూలిపోగా, శిథిలాల కింద పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటన నిర్మాణాల నాణ్యత, అధికారుల పర్యవేక్షణపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. అలాంటి ప్రమాదం మరోసారి జరగకుండా ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాల పటిష్టతను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ఇద్దరు ఐఏఎస్‌ అధికారులున్నా..

భద్రాచలంలో సబ్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీఓ.. ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు ఉన్నారు. అయినా ఏజెన్సీ ప్రాంతంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. రెండు కీలక కార్యాలయాలు భద్రాచలంలోనే ఉన్నందున సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని భూ హక్కులు, నిర్మాణ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పలు భవనాలకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement