● తుపాన్లతో అన్నదాతల్లో ఆందోళన ● పంటలు చేతికందే సమయాన గుబులు
ఖమ్మంవ్యవసాయం: వానాకాలం పంటలు చేతికి అందుతున్న వేళ వరుస తుపాన్లు జిల్లా రైతులను కలవరపెడుతున్నాయి. నిన్నామొన్నటి వరకు అర్నబ్ తుపాన్ ప్రభావం కొనసాగింది. ఆ సమయంలో జిల్లాలోని పలుచోట్ల పంటలు నేలవాలాయి. దీని నుంచి రైతులు తేరుకోకముందే ఆదివారం ‘మురసు’ తుపాన్ గండం మొదలైంది. ఎల్‌నినో పరిస్థితుల్లో అవస్థ పడుతూ సాగు చేసిన వరి, పత్తి వంటి పంటలు ఇప్పుడిప్పుడే చేతికందుతున్నాయి. సాగు సమయాన వానలు లేకపోగా, ఇప్పుడు కోత సమయంలో తుపాన్ల ప్రభావం రైతులను ఆవేదన కలిగిస్తోంది.
1,138 ఎకరాల్లో పంట నష్టం
గత వారం అర్నబ్ తుపాన్ కారణంగా జిల్లాలో వర్షం అంతంత మాత్రంగానే కురిసినా, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలోని 53 గ్రామాల 558 మంది రైతులకు చెందిన 1,138 ఎకరాలకు పైగా వరి పంటకు నష్టం వాటిల్లింది. అలాగే, పలుచోట్ల పత్తి పంటకు కూడా నష్టం ఎదురైంది. వరి నేలవాలడంతో హార్వెస్టర్లతో కోయడం ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు.
ఇప్పుడేం జరుగుతుందో ?
ప్రస్తుత వానాకాలం జిల్లాలో వరి 2,41,109 ఎకరాల్లో, పత్తి 2,35,637 ఎకరాల్లో సాగయ్యాయి. ప్రస్తుతం వరి కోతలు, పత్తి తీతలు జోరుగా సాగుతున్నాయి. ఈనేపథ్యాన వరుస తుపాన్లు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే, తుపాన్ వేళ వరి కోయొద్దని, పత్తి తీతను కూడా నిలిపివేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కాగా, అర్నబ్ ప్రభావం నుంచి తేరుకోకముందే మురసు తుపాన్ ప్రభావం మొదలైంది. కాగా, ఆదివారం ఉదయం జిల్లాలో ఆకాశం మేఘావతమై పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. తుపాన్ ప్రభావం బుధవారం వరకు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యాన రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాకు రెడ్ అలర్ట్
మురసు తుపాన్ నేపథ్యాన జిల్లాతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించింది. ఈనెల 3, 4వ తేదీల్లో(మంగళ, బుధవారం) ప్రభావం ఉంటుందంటూ రెడ్ అలర్ట్ (అతి భారీ వర్షాలు) ప్రకటించారు. అయితే, సోమ, గురువారం కూడా వర్షాలు కురిసే అవకాశముందని చెబుతున్నారు.


