మిల్లర్లతో కుమ్మకై ్కన అధికారుల
తీరుతో సర్కార్‌కు నష్టం
మరోవైపు విజిలెన్స్ అధికారుల చేతివాటం
తాజాగా పౌర సరఫరాల సంస్థ
ఏఎంపై వేటు
వసూల్ రాజాలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పౌర సరఫరాల సంస్థలో అక్రమాల పుట్ట కదులుతోంది. కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ఓవైపు సీఎంఆర్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండగా.. మరోవైపు మిల్లర్లు, పౌర సరఫరాల సంస్థ అధికారుల కుమ్మక్కు వ్యవహారం బట్టబయలవుతోంది. వీటన్నింటినీ పర్యవేక్షించాల్సిన విజిలెన్స్ బృందాల్లో కొందరు అధికారుల తీరు ఇదే తరహాలో ఉండడంతో సంస్థ అవకతవకలకు నిలయంగా మారుతోంది. గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీల పేరుతో వసూళ్లకు పాల్పడిన విషయం బయటపడింది. ఇప్పుడు మిల్లులో ఉన్న నిల్వల కన్నా ఎక్కువగా ఉన్నట్లు లెక్కల్లో చూపిన పౌర సరఫరాల సంస్థ జిల్లా అసిస్టెంట్ మేనేజర్(ఏఎం) రాచూరి సృజన సస్పెన్షన్‌కు గురయ్యారు.
ఏళ్లుగా ఇదే తంతు..
కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు కేటాయించే ధాన్యాన్ని సకాలంలో సీఎంఆర్‌గా మార్చి పౌరసరఫరాల సంస్థకు అందజేయాలి. కానీ కొన్నేళ్లుగా గడువులోగా సీఎంఆర్ అందిన దాఖలాలు లేవు. గడువు పూర్తి కావడం.. ప్రభుత్వం మరికొంత సమయం ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈక్రమాన సీఎంఆర్ అందజేతలో నిర్లక్ష్యంగా వ్యవహరించే మిల్లర్లపై చర్యలు తీసుకోవాల్సిన పౌర సరఫరాల సంస్థ అధికారుల తీరు అందుకు విరుద్ధంగా ఉంటోంది. సకాలంలో సీఎంఆర్ చెల్లించకపోయినా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. అధికారులు – మిల్లర్ల మధ్య ఉన్న అవగాహనే ఇందుకు కారణమనే చర్చ జరుగుతోంది.
14 మిల్లుల్లో తక్కువ నిల్వలు..
జిల్లాలో 2025–26 ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లో సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లర్లకు అప్పగించారు. అయితే మిల్లర్లు బియ్యాన్ని అందజేయకపోవడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీలు చేపట్టింది. ఈ మేరకు 14 మిల్లుల్లో భారీ స్థాయిలో ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ ధాన్యం విలువ రూ. 64,63,35,632 కాగా.. అధికారులు ధాన్యం విలువ, జరిమానాలో 11 మిల్లుల నుంచి కొంత మేర రికవరీ చేశారు. అయినా ఇంకా రూ.కోట్లలో బకాయి రావాల్సి ఉంది. అలాగే అక్రమాలకు పాల్పడిన ఆరు రైస్ మిల్లుల బాధ్యులపై పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
అంతా సాఫీగా ఉన్నట్లు...
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మర ఆడించి సీఎంఆర్‌కు ప్రభుత్వానికి అప్పగించేలా మిల్లులకు కేటాయిస్తారు. కానీ మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా ధాన్యం పక్కదారి పట్టిస్తున్నారు. కొన్నేళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండగా, ప్రభుత్వం తనిఖీలకు నిర్ణయించినా పౌరసరఫరాల సంస్థ అధి కారులు–మిల్లర్ల మధ్య అవగాహనతో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మిల్లుల తనిఖీ సమయాన రికార్డులకు సరిపడా నిల్వలు లేకున్నా అంతా సవ్యంగానే ఉందని నివేదికలు ఇస్తున్నారు. ఈనెల 14న ఖమ్మంలోని శ్రీరామ మోడ్రన్ పారాబాయిల్డ్ రైస్‌మిల్లును పౌర సరఫరాల సంస్థ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ రాచూరి సృజన తనిఖీ చేశారు. మిల్లులో 2025–26 ఖరీఫ్ ధాన్యం 2,384.920 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు నమోదు చేశారు. ఇదే మిల్లుల్లో తర్వాత రెండు రోజులకు ఈటీఎఫ్ మెంబర్ వి.సైదులు తనిఖీ చేస్తే 2,071 మెట్రిక్ టన్నుల ధాన్యమే ఉందని బయటపడింది. దీంతో విచారణ అనంతరం అసిస్టెంట్ మేనేజర్‌ను సస్పెండ్ చేశారు. ఈక్రమంలోనే పౌర సరఫరాల సంస్థల్లోని ఇంకొందరు అధికారులు, ఉద్యోగులపైనా విచారణ జరుగుతున్నట్లు తెలిసింది.
మిల్లుల్లో తగ్గుతున్న
సీఎంఆర్ ధాన్యం నిల్వలు
నిబంధనలను ఖాతరు చేయకుండా మిల్లర్లు రేషన్ బియ్యం దందా చేయడమే కాక సీఎంఆర్, ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తుండడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యాన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనిఖీలకు రిటైర్డ్ డీఎస్పీ నేతృత్వాన బృందాన్ని నియమించారు. అయితే, తనిఖీల సమయంలో బృందం ఇన్చార్జి వసూళ్లకు పాల్పడడం గమనార్హం. బృందంలోని మరో ఇద్దరు ఉద్యోగులతో కలిసి వసూళ్లకు పాల్పడినట్లు బయటపడింది. ముదిగొండలోని ఓ రైస్ మిల్లర్ నుంచి రూ.5 లక్షలు, టేకులపల్లి మండలంలోని రేషన్ బియ్యం దందా చేస్తున్న వ్యక్తి నుంచి రూ.4 లక్షలు వసూలు చేశారని సంస్థ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు ఫిర్యాదులు వెళ్లాయి. ఫలితంగా ఆయా మిల్లుల్లో తనిఖీ సందర్భంగా అక్రమాలను గుర్తించినా వదిలేసినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.


