బేకరీ బట్టీ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

బేకరీ బట్టీ సీజ్‌

Nov 1 2026 12:21 AM | Updated on Nov 1 2026 12:21 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం ముస్తఫా నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సుధా ఎంటర్‌ప్రైజెస్‌ బేకరీకి సంబంధించిన బట్టీని అధికారులు శనివారం సీజ్‌ చేశారు. బట్టీ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ, బూడిద కారణంగా ఇబ్బంది పడుతున్నట్టు సమీప ప్రజల నుంచి అందిన ఫిర్యాదుతో గతంలో నోటీసులు జారీ చేసినా, జరిమానా విధించినా యజమాన్యం పట్టించుకోలేదని గుర్తించారు. ఈమేరకు ఇన్‌చార్జ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కె.మల్లయ్య, ఫుడ్‌ సేఫ్టీ అధికారి లోకేష్‌తో పాటు వివిధ విభాగాల సిబ్బంది పరిశీలించి సీజ్‌ చేశారు. వ్యాపార సంస్థల నిర్వాహకులు మున్సిపల్‌ నిబంధనలు, కాలుష్య నియంత్రణ ప్రమాణాలు, ఆహార భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌

పోటీలకు జట్ల ఎంపిక

కల్లూరు రూరల్‌: హైదరాబాద్‌లో ఈనెల 2వ తేదీ నుంచి జరిగే రాష్ట్రస్థాయిలో పోటీల్లో పాల్గొనే అథ్లెటిక్స్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్లను శనివారం ఎంపిక చేశారు. కల్లూరులోని మినీ స్టేడియంలో శనివారం జరిగిన ఎంపిక పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 184 మంది బాలబాలికలు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబర్చిన వారిని గుర్తించి ఈవెంట్‌కు ఇద్దరు చొప్పున 36 మందిని ఎంపిక చేసినట్లు పాఠశాలల క్రీడా సమాఖ్య జిల్లా కార్యదర్శి వై.చిన్ని తెలిపారు. ఎంపిక పోటీలను పీడీలు, పీఈటీలు సీహెచ్‌.కృష్ణయ్య, సుధీర్‌, రవి, వీరరాఘవయ్య, ఎస్‌.కే.నాగుల్‌ మీరా, ఎస్‌.కే.రంజాన్‌, వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.

అడ్మిట్‌ కార్డులు

డౌన్‌లోడ్‌ చేసుకోండి

కూసుమంచి: పాలేరులోని జవహర్‌ నవోదయ విద్యాలయలో 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ వెంకటరమణ సూచించారు. నవోదయ విద్యాసమితి వెబ్‌సైట్‌లో అడ్మిన్‌ కార్డులు అందుబాటులో ఉన్నాయని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

మత్స్యకారులకు ముగిసిన శిక్షణ

కూసుమంచి: కూసుమంచి మండలం పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో మత్స్య రైతులు, మత్స్యకారులకు దేశవాళీ తెల్లచేపల పెంపకంపై ఇస్తున్న మూడు రోజుల శిక్షణ శనివారంతో ముగిశాయి. ఖమ్మం, ఆసిఫాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్‌ జిల్లాల మత్స్యరైతులు పాల్గొనగా, ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం ఫార్మర్‌ డీన్‌ డాక్టర్‌ రవీంద్రకుమార్‌రెడ్డి పలు అంశాలను అవగాహన కల్పించారు. దేశవాళీ చేపల పెంపకంలో యాజమాన్య పద్ధతులు తదితర అంశాలను వివరించగా, శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలేరు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ శ్యాంప్రసాద్‌, శాస్త్రవేత్తలు రవీందర్‌, శాంతన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో

ఖమ్మం ఉద్యోగుల సేవలు

ఖమ్మంవ్యవసాయం: ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్‌ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతినగా, పునరుద్ధరణ పనుల్లో ఖమ్మం సర్కిల్‌ ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఏపీలోని వెట్లపాలెం, కొప్పిగుంట, తిమ్మాపురం, ఇనవోలు, నకరం, అమలాపురం తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు పనుల్లో సర్కిల్‌ నుంచి వెళ్లిన 468 మంది సిబ్బంది పాల్గొంటున్నారని ఎస్‌ఈ శ్రీనివాసాచారి తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో త్వరగా విద్యుత్‌ పునరుద్ధరణే లక్ష్యంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement