● వాహనం ట్యూబ్ పగిలి, రిమ్ విరగడంతో ఘటన
నేలకొండపల్లి: ఖమ్మం – కోదాడ జాతీయ రహదారి వెళ్తున్న వాహనం టైర్‌లోని ట్యూబ్ పగలడమే కాక రిమ్ విరగడంతో బోల్తా పడింది. ఘటనలో పలువురు తీవ్ర గాయాలతో బయటపడగా పెనుప్రమాదం తప్పినట్లయింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన సెంట్రింగ్ కూలీలు శనివారం ఖమ్మం నుంచి కోదాడకు అశోక్ లేలాండ్ వాహనంలో కర్ర తీసుకెళ్తున్నారు. మార్గమధ్యలో నేలకొండపల్లికి రాగానే వాహనం టైర్‌లోని ట్యూబ్ పగలడమే రిమ్ విరగడంతో బోల్తా పడింది. సెంట్రింగ్ కర్రలపై కూర్చున్న బయ్యారానికి చెందిన సురేష్, రాంసింగ్, సురేష్, హన్మంతు, నరేష్‌కు తీవ్రగాయాలు కాగా, క్యాబిన్‌లో ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను నేషనల్ హైవే అంబులెన్స్‌లో నేలకొండపల్లి ఆస్పత్రికి తరలించి ప్రథమ కిచిత్స అనంతరం ఖమ్మం తరలించారు. ఈమేరకు పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు.
బ్యాంకు ఉద్యోగినిపై సహోద్యోగి కత్తి దాడి
వైరా: వైరా మున్సిపాలిటీ పరిధి బ్రాహ్మణపల్లి అగ్రహారం గ్రామీణ వికాస బ్యాంక్‌లో మహిళా ఉద్యోగినిపై సహోద్యోగి కత్తితో దాడి చేశారు. ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం చివరకు కత్తిపోట్లకు దారి తీసింది. గ్రామీణ వికాస బ్యాంక్‌లో ఫీల్డు అఫీసర్లుగా తేజశ్రీ, పిల్లి ప్రదీప్ విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతకాలంగా ప్రదీప్ ప్రవర్తనలో తేడా రావడంతో దూరంగా ఉండాలని తేజ అతనిని దూరంగా ఉండమని హెచ్చరించింది. ఈక్రమాన శనివారం మధ్యాహ్నం 2గంటల సమయాన బ్యాంకులోనే ప్రదీప్ కూరగాయలు కోసే కత్తితో తేజశ్రీపై ఒక్కసారిగా దాడి చేశాడు. ఘటనతో అవాక్కయిన ఆమె తప్పించుకునే క్రమాన చేతులు అడ్డుపెట్టగా బలమైన గాయమైంది. బ్యాంకు మేనేజర్, సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా, తనపై దాడి చేయడమే కాకుండా చంపుతానని ప్రదీప్ బెదిరిస్తున్నాడని ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ పి.రామారావు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య
చింతకాని: ఆర్థిక ఇబ్బందులు తాళలేక చింతకాని మండలం చిన్నమండవకు చెందిన నాగులవంచ శ్రీనివాసరావు(50) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ముదిగొండ మండలం పమ్మి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు రెండు నెలల క్రితం చిన్నమండవకు వచ్చి సెలూన్ షాప్ నడిపిస్తున్నాడు. అయితే, ఆయన గతంలో ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి ఇంటిపై రుణం తీసుకున్నాడు. ఆ రుణం చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఎలుకల నివారణ మందు తాగగా ఆయనను 108లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శ్రీనివాసరావు మృతి చెందగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు.


