● బాలికల గురుకుల పాఠశాలలో ఊడిపడిన పెచ్చులు ● తీవ్రగాయాలతో బయటపడిన ఇద్దరు విద్యార్థినులు ● మరమ్మతు పనులు మధ్యలో ఆగడమే కారణమని విమర్శలు
బోనకల్: బోనకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో శనివారం పెనుప్రమాదం తప్పింది. స్లాబ్ పైపెచ్చులు ఊడి పడడంతో పాఠం వింటున్న ఇద్దరు విద్యార్థులపై పడగా తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఇదే సమయాన విద్యార్థినులంతా బయటకు పరుగులు తీశారు. పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు 580 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఈమేరకు శనివారం 9వ తరగతి విద్యార్థులు 60 మందికి ఉపాధ్యాయురాలు సాంఘిక శాస్త్రం పాఠం బోధిస్తుండగా, స్లాబ్ పైకప్పు నుంచి కాంక్రీట్ పెచ్చులు ఊడి పడ్డాయి. దీంతో చిరునోములకు చెందిన చాపలమడుగు పూజిత తలకు, నాగిలిగొండకు చెందిన అద్దంకి కీర్తన కాలికి తీవ్రగాయమైంది. ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ షేక్ షీలాబేగం, ఉపాధ్యాయులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా డాక్టర్ స్రవంతి చికిత్స చేశారు. విషయం తెలిసి ఆస్పత్రికి వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లల పరిస్థితి చూసి కన్నీరుమున్నీరయ్యారు.
మధ్యలో ఆగిన మరమ్మతులు
2013లో నిర్మించిన పాఠశాల భవనం కొన్నేళ్లకే శిథిలావస్థకు చేరుకుంది. ఈ విషయాన్ని పది నెలల క్రితం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో మరమ్మతులకు రూ.15 లక్షలు మంజూరు చేశారు. అయితే, కాంట్రాక్టర్ రత్నాకర్ కేవలం రూ.3.50లక్షలతో డ్రెయినేజీ పనులు చేపట్టి, స్లాబ్ పనులను నిలిపివేశారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో కాంట్రాక్ట్ రద్దుచేసి రూ.11.50లక్షలతో మరమ్మతుల పనులను మరో కాంట్రాక్టర్‌కు కేటాయించినా ఇంకా ప్రారంభించలేదు. కాగా, ప్రమాద సమాచారం తెలియడంతో తహసీల్దార్ సుధాకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు ఆస్పత్రిలో విద్యార్థినుల చికిత్సపై ఆరా తీశారు. ఘటనపై సమగ్ర నివేదిక ఉన్నతాధికారులకు అందిస్తామని తహసీల్దార్ తెలిపారు. అయితే, ప్రస్తుతం స్లాబ్ పెచ్చులు ఊడినపడిన గదిలోనే కాక మరికొన్ని గదుల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నందున అధికారులు తక్షణమే స్పందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
పెచ్చులు ఊడి సువ్వలు తేలిన
మరో గదిలో విద్యార్థినులు


