సాంస్కృతిక పోటీల్లో విద్యుత్‌ ఉద్యోగుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక పోటీల్లో విద్యుత్‌ ఉద్యోగుల ప్రతిభ

Oct 30 2026 12:21 AM | Updated on Oct 30 2026 12:21 AM

ఖమ్మంవ్యవసాయం: తెలంగాణ విద్యుత్‌ సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు యాదగిరిగుట్టలో నిర్వహించిన ఇంటర్‌ సర్కిల్‌ సాంస్కృతిక పోటీల్లో ఖమ్మం సర్కిల్‌ ఉద్యోగులు ప్రతిభ కనబరిచారు. జానపద గీతాల పోటీల్లో పురుషుల విభాగం నుంచి ఏ.శేఖర్‌బాబు ప్రథమ బహుమతి సాధించగా, వాయిద్య సంగీత విభాగంలో వి.ఫణికుమార్‌ రన్నరప్‌గా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలను గురువారం ఖమ్మంలో చీఫ్‌ ఇంజనీర్‌(ప్రాజెక్ట్స్‌) ఏ.సురేందర్‌, ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి అభినందించారు.

కాల్వలకు భూసేకరణపై గ్రామసభలు

రఘునాథపాలెం: సీతారామ ప్రాజెక్ట్‌ ప్యాకేజీ–4 పరిధిలో ఎల్‌ఎం–15 కాల్వల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణపై అధికారులు దృష్టి సారించారు. ఈమేరకు రఘునాథపాలెం మండలం మంచుకొండ, రేగులచలక, కోయచలక, చిమ్మపూడిల్లో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (భూసేకరణ) జి.సదానందం ఆధ్వర్యాన గురువారం గ్రామసభలు నిర్వహించారు. కాల్వల అలైన్‌మెంట్‌, ఎంత మేర భూమి అవసరమవుతుందనే అంశాన్ని జలవనరులశాఖ డీఈ జి.మోతీలాల్‌ వివరించారు. అనంతరం ఎస్‌డీసీ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందుతుందని తెలిపారు. తహసీల్దార్‌ ఎస్‌.శ్వేత, సర్పంచ్‌లు యండపల్లి రమాదేవి, నర్సిరెడ్డి, శంకర్‌, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రణాళికాయుతంగా

గ్రంథాలయాల అభివృద్ధి

ఖమ్మంగాంధీచౌక్‌: జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రణాళికాయుతంగా చర్యలు తీసుకుంటున్నామని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ మహ్మద్‌ ఖాదర్‌ బాబా తెలిపారు. ఖమ్మంలోని సిటీ లైబ్రరీలో గురువారం నిర్వహించిన సమావేశంలో బడ్జెట్‌పై చర్చించాక ఆయన మాట్లాడారు. సొంత భవనాలు కలిగిన గ్రంథాలయాల మరమ్మతులు, సౌకర్యాల కల్పనతో పాటు అవసరమైన చోట నూతన భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. అలాగే, ఇంటర్నెట్‌ సేవలు, కలర్‌ ప్రింటర్లు, అంధ విద్యార్థుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా, గ్రామపంచాయతీల నుంచి సెస్‌ బకాయిల వసూలుపై దృష్టి సారించామని చైర్మన్‌ వెల్లడించారు. ఈ సమావేశంలో డీపీఆర్‌ఓ ఎం.ఏ.గౌస్‌, గ్రంథాలయ కార్యదర్శి పి.పద్మజ తదితరులు పాల్గొన్నారు.

నేడు రైతుల ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్‌’ నిధులు

1.03 లక్షల మందికి రూ.20.68 కోట్లు

ఖమ్మంవ్యవసాయం: పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకం 24వ విడత నిధులను ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం గుజరాత్‌లోని బనస్కంత నుంచి విడుదల చేయనున్నారు. ఈ విడతలో జిల్లాకు చెందిన 1.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున రూ.20.68 కోట్లు జమ కానున్నాయి. కాగా, నిధుల విడుదల కార్యక్రమాన్ని జిల్లాలోని 62 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశామని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు.

కనుల పండువగా రామయ్య కల్యాణం

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా సాగింది. తొలుత గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం రామసేవా మండపంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement